ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ ధరలు తో పోటీ- పడుతున్న పేద మద్య తరగతి ప్రజలకు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గడిచిన పదిహేను రోజులకు, ఇప్పటికి కూరగాయల ధరలు 50 శాతం పెరిగిన ధరలను చూసి ప్రజలు హడలెత్తిపోతున్నారు. కార్తీకమాసంలో సహజంగా మాంసాహారం కంటే కూరగాయలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దీంతోపాటు- వివాహ శుభ కార్యాలు, గృహప్రవేశాలు తదితర శుభ కార్యాలు ఎక్కువగా ఉండటం వలన కూరగాయలకు మరింత డిమాండ్ పెరిగింది.
ప్రధానంగా టమాటా, ఉల్లిపాయ ధరలు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. ఏ రకం కూరగాయలు చూసుకున్నా 80 నుంచి …100 రూపాయలు కిలో ధర పలుకుతుంది. హోల్ సేల్ మార్కెట్లో అన్ని రకాల కూరగాయలు 10 కిలోల చొప్పున ధరలు ఇలా ఉన్నాయి ఉల్లిపాయ 10 కిలోలు 500, బంగాళదుంప 400, టమాటో 28 కిలోల బాక్స్ 1850 రూపాయలు, వంకాయలు 10 కిలోలు 500, దొండకాయలు 500, బీట్ రూట్, క్యారెట్ 800, బీరకాయలు 800 ఇలా అన్ని రకాల కూరగాయల ధరలు మండి పోతున్నాయని పేద మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
అనకాపల్లి మార్కెట్ కు కర్నూల్, మహారాష్ట్ర, బళ్లారి, రాజస్థాన్ తదితర ప్రాంతాల నుంచి ఉల్లిపాయ అధికంగా దిగుమతి అవుతుంది. అయితే ఆయా ప్రాంతాల్లో ఉల్లి పంట సమంగా లేకపోవడం, డీజిల్ ధర ప్రభావంతో రవాణా చార్జీలు పెరగడం తదితర కారణాల వల్ల ఉల్లికి డిమాండ్ పెరిగింది. టమాటో బెంగళూరు నుంచి దిగుమతి అవుతుందని స్థానిక వర్తకులు చెబుతున్నారు. పెరుగుతున్న ధరలు చూసి పేద మధ్య తరగతి ప్రజలు ప్రభుత్వాలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు 150 రూపాయలతో మూడు రకాల కూరగాయలు వచ్చేవని, నేడు 500 పట్టు-కుంటే గాని నాలుగు రకాల కూరగాయల రావడంలేదని ఇలా అయితే పచ్చడి మెతుకు లే గతి అని మార్కెట్ కు వచ్చిన మహిళలు కూరగాయల ధరలు చూసి ఉలికి పడుతూ వ్యక్తం చేస్తున్నారు.