విజయనగరం, (ప్రభ న్యూస్) :రైతు బజార్‌లో బోర్డు మీద ప్రకటించిన ధరలకు మాత్రమే కూరగాయలను విక్రయించాలని, అంతకన్నా ఎక్కువగా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని సంయుక్త కలెక్టర్ డాక్టర్ జీసీ కిషోర్ కుమార్ తెలిపారు. బుధవారం ఆర్ అండ్ బీ రైతు బజార్‌ను జేసీ ఆకస్మికంగా తనిఖీ చేసారు. రైతులతో కూరగాయల లభ్యత, ధరలు, తదితర అంశాలపై మాట్లాడారు. ఈ మధ్య కురిసిన వర్షాలకు కూరగాయల పంటలు దెబ్బతినడం వలన బైట మార్కెట్ల నుండి తెప్పించడం జరుగుతోందని, అందువలన ధరలు అధికంగా ఉంటున్నాయని రైతులు తెలిపారు. ముఖ్యంగా టమాటా చిత్తూరు జిల్లా మదనపల్లి, పలమనేరు నుండి వస్తున్నాయని, అక్కడ కూడా వర్షాలు పడడం వలన పంట నష్టం జరగడంతో అధిక ధరలకు కొంటున్నామని వివరించారు.
అయినప్పటికీ బహిరంగ మార్కెట్ల కన్నా 20 శాతంపై బడి తక్కువకే రైతు బజార్ ధరలు ఉన్నాయని అన్నారు. జిల్లాలో కూరగాయల కొరత లేదని, కృత్రిమ కొరతలు సృష్టించి, అధిక ధరలకు విక్రయించవద్దని ఆదేశించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో చేయగలిగేది ఏమీ లేదని, మరో 15 రోజుల్లో పరిస్థితులు చక్కబడి, దిగుబడి పెరగవచ్చని ఆశాభావం వ్యక్తం చేసారు. వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాలను అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. జేసీ వెంట మార్కెటింగ్ సహాయ సంచాలకులు శ్యామ్‌కుమార్ , ఎస్టేట్ అధికారి సతీష్ పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily