Sunday, November 17, 2024

Delhi: వీసీఐసీ మాస్టర్ ప్లాన్ పూర్తి, తెలంగాణలో జీసీటీ స్థానాల గుర్తింపు.. ఎంపీల ప్రశ్నలకు కేంద్రం జవాబులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ (వీసీఐసీ) కింద విశాఖ నోడ్ మాస్టర్ ప్లానింగ్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తి చేసిందని కేంద్రం తెలిపింది. ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ఫ్రేమ్‌వర్క్‌ కింద వీసీఐసీని చేర్చడానికి ఏపీ ప్రభుత్వం 2018 అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనను సమర్పించిందా అని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌గోయల్‌ జవాబిచ్చారు. వీసీఐసీ కింద ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆర్థిక సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్టణం నోడ్‌ను సొంతంగా అభివృద్ధి చేసిందని తెలిపారు.

చిత్తూరు (శ్రీకాళహస్తి) – కడప (కొప్పర్తి) నోడ్స్‌కు సంబంధించి మాస్టర్‌ ప్లానింగ్, ప్రిలిమినరీ ఇంజనీరింగ్‌తో సహా ప్రాజెక్ట్‌ అభివృద్ధి కార్యకలాపాల కోసం 3.13 కోట్లు వినియోగించినట్లు చెప్పారు. ప్రస్తుతం చిత్తూరు నోడ్‌కు సంబంధించి వివరణాత్మక మాస్టర్‌ ప్లానింగ్, ప్రిలిమినరీ ఇంజనీరింగ్‌ తయారీ కోసం కన్సల్టెంట్లను నియమించినట్లు తెలిపారు. కడప నోడ్‌ కోసం మాస్టర్‌ ప్లాన్‌ పూర్తయిందని, సుమారుగా 2,400 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉందని వెల్లడించారు.

సత్తుపల్లిలో జీసీటీ
తెలంగాణలో గతి శక్తి కార్గో టెర్మినల్స్‌ ఏర్పాటు కోసం పధ్నాలుగు స్థానాలను తాత్కాలికంగా గుర్తించినట్లు కేంద్ర రైల్వే శాఖ తెలిపింది. జీసీటీ ప్రమోటర్ల నుంచి స్వీకరించిన ప్రతిపాదనల ప్రకారం పరిశ్రమల అవసరాన్ని బట్టి స్థలాలను తాత్కాలికంగా గుర్తిస్తారా అని టీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ లిఖితపూర్వక బదులిచ్చారు. సత్తుపల్లి, రామగుండం, సుల్తానాబాద్, మణుగూరు, నాగలపల్లి, ఉప్పల్, రుద్రంపూర్, శ్రీశాంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ స్టేషన్, జాన్కంపేట్, ఉప్పల్వాయి, తిప్పర్తి, విష్ణుపురం, చిట్యాల్‌ జాబితాలో ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే సత్తుపల్లి వద్ద ఒక గతి శక్తి కార్గో టెర్మినల్‌ ప్రారంభించామని కేంద్రమంత్రి వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement