రాజ్యాంగాన్ని మార్చాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఘాటుగా స్పందించారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని కేసీఆర్ అవమానించే విధంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ” క్రొత్త రాజ్యాంగo కావాలంటాడేంటి ఆ ముఖ్యమంత్రి. అంటే, డా: అంబేడ్కర్ వ్రాసిన రాజ్యాంగo అక్కర్లేదా? అవుసరమైనప్పుడు రాజ్యాంగానికీ చేర్పులు చేసుకొనే అవకాశముందని ఆయనకు తెలియదా? ఈ మాత్రo తెలియకుండా, అసలు క్రొత్త రాజ్యాంగo కావాలంటే, అంబేడ్కర్ ను అవమానించినట్లే, అర్ధo చేసుకోండని మనవి” అని వర్ల రామయ్య పేర్కొన్నారు.
కాగా, నిన్న కేంద్ర బడ్జెట్‌పై స్పందించిన సీఎం కేసీఆర్.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా రాజ్యాగాన్ని మార్చాలంటూ వ్యాఖ్యానించారు. దేశంలో రాజ్యాంగాన్ని ఇప్పటికి 80 సార్లు సవరించారని, దేశాన్ని బాగు చేయడానికి కొత్త రాజ్యాంగం అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. చాలా దేశాలు రాజ్యాంగాలను మార్చాయని, మన దేశంలోనూ అది జరగాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.