Tuesday, November 26, 2024

AP: కసింకోటలో విరివిగా సంక్షేమ పథకాలు .. మంత్రి అమర్నాథ్

కసింకోట, సెప్టెంబర్ 12(ప్రభ న్యూస్): కసింకోట మండలంలో ప్రభుత్వం మంజూరు చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు అర్హులందరికీ సమృద్ధిగా అందుతున్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంగళవారం మంత్రి అమర్నాథ్ కసింకోట మండలం ఉగ్గిన పాలెం గ్రామంలో పర్యటించినప్పుడు గ్రామస్తులంతా వచ్చి మంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువగా చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.


ఈ గ్రామంలో 19.65 లక్షల రూపాయల వ్యయంతో కొత్తగా నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని, 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. అదేవిధంగా 16 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అంగన్వాడి భవనాన్ని మంత్రి అమర్నాథ్ ప్రారంభించారు. అలాగే ఉగ్గినపాలెం గ్రామ ప్రజలకు తాగునీటిని అందించేందుకు అవసరమైన 19.40 లక్షల రూపాయలతో నిర్మించిన 60 కే.ఎల్ వాటర్ ట్యాంక్ ను మంత్రి అమర్నాథ్ ప్రారంభించారు. అలాగే 6.4 లక్షల రూపాయలతో నిర్మించిన చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అదేవిధంగా 15.20 లక్షల రూపాయలతో నిర్మించిన సి.సి.రోడ్లు డ్రైన్లను, మూడు లక్షల రూపాయలతో నేర్పించిన కమ్యూనిటీ హాల్ను ఆయన ప్రారంభించారు.

గ్రామాల్లోని మండల ప్రాథమిక పాఠశాల భవనాన్ని 18.86 లక్షల రూపాయలతో నాడు నేడు పథకం కింద ఆధునీకరించిన భవనాన్ని మంత్రి అమర్నాథ్ ప్రారంభించారు. ఇదిలా ఉండగా, బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి కింద ఉగ్నిపాలెం గ్రామంలోని 19 స్వయం సహాయక సంఘాల్లోని 26 మంది సభ్యులకు కోటి 90లక్షల రూపాయల చెక్కును మంత్రి అమర్నాథ్ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కసింకోట మండలంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని చెప్పడానికి ఇప్పుడు ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలు నిదర్శనమన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనకాపల్లి నియోజకవర్గంలో పూర్తిస్థాయి అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదం తెలిపిందని అమర్నాథ్ అన్నారు. రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని, ప్రతి నగరాన్ని పూర్తిస్థాయిలో ఆధునీకరించి ప్రజల జీవన స్థితిగతులను మరింత మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారని ఆయన తెలియజేశారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద నమ్మకం ఉంచి తిరిగి తమ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువస్తే, ప్రజలకు ఇప్పుడు అందుతున్న సౌకర్యాలతో పాటు, మరిన్ని అదనపు సౌకర్యాలు కూడా అందే అవకాశం ఉంటుందని అమర్నాథ్ చెప్పారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు భీశెట్టి సత్యవతి, కశింకోట ఎంపీపీ కలగా లక్ష్మీ గున్నాయ నాయుడు, జడ్పీటీసీ దంతులూరి శ్రీధర్ రాజు, మండల పార్టీ అధ్యక్షుడు మలసాల కిషోర్, జిల్లా అధికార ప్రతినిధి మళ్ళ బుల్లిబాబు, గొల్లవిల్లి శ్రీనివాస రావు, వైస్ ఎంపీపీలు నమ్మి మీనా, పెంటకోట జ్యోతి , సర్పంచ్ లు, ఎంపీటీసీలు, వార్డ్ మెంబెర్లు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement