Thursday, November 21, 2024

మహిళా లోకానికి చీకటి రోజు

సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు యువతిని విచారణ పేరిట అర్ధరాత్రి వరకు పోలీస్ స్టేషన్ లోనే వుంచడాన్ని టిడిపి మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తప్పుబట్టారు. ఇది మహిళా లోకానికి చీకటిరోజని అన్నారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టిందని జ్యోతిశ్రీ అనే యువతిని అరెస్టు చేసి అర్థరాత్రి వరకు స్టేషన్ లో వుంచడం దుర్మార్గమని వంగలపూడి అనిత మండిపడ్డారు. సోషల్ మీడియా పోస్టులపై మహిళను అర్థరాత్రి వరకు స్టేషన్ లో వుంచడం రాష్ట్ర చరిత్రలో లేదన్నారు. చిన్నపిల్లలు ఉన్నారనే కనికరం కూడా లేకుండా విచారణ పేరుతో స్టేషన్ లోనే వుంచడం దారుణమని అనిత మండిపడ్డారు. 

”జగనన్న 14రోజుల రిమాండ్ పథకంతో ముసలీ ముతక, మహిళ అనే బేధం లేకుండా జైల్లో పెడుతున్నారు. మహిళల పోస్టులదాటికి జగన్ రెడ్డి భయపడ్డారని తేలిపోయింది. ప్రతిరోజూ టీడీపీ మహిళలపై, అమరావతి మహిళలపై, ప్రతిపక్ష పార్టీలపై వైసీపీ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు. వారిపై ఎన్ని చర్యలు తీసుకున్నారో సీఐడీ, డీజీపీ సమాధానం చెప్పాలి” అని డిమాండ్ చేశారు. 

”టీడీపీ నేతలను దూషిస్తూ వైసీపీ సోషల్ మీడియాలో ఇబ్బందికరమైన పోస్టింగులపై డీజీపీ, సీఐడీకి టీడీపీ ఫిర్యాదు చేసినా నిందితులను పట్టుకోలేదు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం పౌరస్వేచ్ఛ అని వైసీపీ నేతలు చెప్పింది గుర్తులేదా.? మరి ఇప్పుడు మహిళలు పోస్టులు పెడితే ఎందుకు అరెస్టు చేస్తున్నారు? వైసీపీ క్రూరజంతువులకు ఉన్న పౌరస్వేచ్ఛ మహిళలకు లేదా? మహిళల రక్షణే పోలీసుల ప్రాథమిక కర్తవ్యం కావాల్సింది పోయి వైసీపీ నేతల రక్షణే తమ ప్రాథమిక ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు. జీవించే హక్కును, స్వేచ్చను, వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగిస్తే తీవ్ర పర్యవసానాలకు దారితీస్తుందనే విషయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి గుర్తుంచుకోవాలి” అని హెచ్చరించారు. 

”వైసీపీ పాలనలోనే మహిళలకు రక్షణ లేకుండా పోయింది. బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన పరిస్తితి ఏర్పడింది. అక్రమ కేసులు బనాయించి వేధించడం, మహిళల గొంతు నొక్కడం ప్రజాస్వామ్యం కాదన్న విషయం ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. మహిళను పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి ఏ విధంగా ఉంచుతారు? మహిళల గొంతునొక్కడంపై ఉన్న శ్రద్ధ వారిపై అత్యాచారాలు, హత్యలు చేసిన నిందితులను పట్టుకోవడంలో చూపిస్తే ఎంతో మంది మహిళలకు న్యాయం చేసినవారవుతారు” అని వంగలపూడి అనిత సూచించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement