విశాఖ జిల్లాలో మళ్లీ మరోసారి ఎన్నికల నగరా మోగింది. మళ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అదీ మంగళవారం నుంచే. దీనికి సంబంధించి భారత ఎన్నికల సంఘం న్యూఢిల్లీలో మంగళవారం సాయంత్రం రాష్ట్రంలో జరపాల్సిన 11 స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి హడావిడి మొదలైంది. విశాఖ జిల్లాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకూ ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పప్పల చలపతిరావు, బుద్ద నాగ జగదీశ్వరరావుల స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేసేందుకు గట్టి పోటీ పెరుగుతోంది. అయితే, మొదటి నుంచి పార్టీని నమ్ముకుని పార్టీతోనే ఉంటున్న వారికి అధిష్టానం పెద్ద పీట వేస్తుందని పార్టీ పెద్దలు బాహాటంగా చెబుతున్నారు. ప్రస్తుతం పార్టీ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న 21వ వార్డు కార్పొరేటర్ వంశీ కృష్ణ శ్రీనివాస్, పార్టీ సీనియర్ నాయకురాలు వరుదు కళ్యాణిల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరికి ఈ సారి ఎంఎల్సీలుగా అవకాశం కల్పిస్తారనే చర్చలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.
వంశీ కృష్ణ శ్రీనివాస్‌కు నగర మేయర్‌గా అవకాశం కల్పిస్తారని ఆశించినా వారికి నిరాశ మిగిలినప్పటికీ వంశీ కృష్ణ శ్రీనివాస్ మాత్రం పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏది నిర్ణయిస్తే అలా నడుచుకోవడమే తాను చేస్తానని, ఈ విషయంలో ఎవ్వరూఎలాంటి అభిప్రాయాలనూ వ్యక్తం చేయొద్దంటూ బాహాటంగా ప్రకటించి అధిష్టానం ప్రకటించిన గొలగాని హరి వెంకట కుమారికి సంపూర్ణ మద్దతు ప్రకటించడం తెలిసిందే. పార్టీని, అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించే వ్యక్తిగా వంశీ కృష్ణ శ్రీనివాస్‌కు ఉన్న ఈ వ్యక్తిత్వమే ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం కల్పిస్తుందనే ఆశాభావంను ఆశావాహులు వ్యక్తం చేస్తున్నారు. అలాగే వరుదు కళ్యాణి మొదటి నుంచీ వైకాపాలో ప్రాతినిధ్యం వహిస్తున్న పాత్ర నేపద్యంలో ఆమెకూ అవకాశం కల్పిస్తారని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సుధాకర్‌తో పాటూ మరికొందరు సైతం ఎంఎల్సీ పదవి కోసం ఎవరి ప్రయత్నాల్లో వారున్నట్లు గా సమాచారం. ఇక తెలుగుదేశం పార్టీకి ఈ సారి ఎంఎల్సీలుగా ప్రతిపాదించుకునే సత్తా నేపథ్యంలో చర్చలు జరుగుతున్నాయి. అధికారిక ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం ఈనెల 16వ తేదీన ఈ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈనెల 23వ తేదీ చివరి తేదీగా ప్రకటించారు. 24వ తేదీన దాఖలైన నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్లు దాఖలుచేసిన వారెవ్వరైనా ఉపసంహరించుకుంటే దానికి గడువును 26వ తేదీని నిర్ణయించారు. డిసెంబరు 10వ తేదీన ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచీ సాయంత్రం నాలుగు గంటల వరకూ జరుపుతారు. ఓట్ల లెక్కింపును డిసెంబరు 14వ తేదీన జరుపుతారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు.