Monday, November 25, 2024

TTD | జనవరి 10 నుంచి వైకుంఠ ద్వారదర్శనాలు.. సాధారణ భక్తులకు ప్రాధాన్యత

తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్షా సమావేశం నిర్వహించారు. సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 10 నుంచి 19 వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వాద‌దర్శనాలను టీటీడీ కల్పించనుంది. అయితే వైకుంఠ ఏకాదశికి ఇంకా 40 రోజుల సమయం ఉన్నందున ఆయా శాఖల అధికారులంతా సన్నద్ధం కావాలని అదనపు ఈఓ ఆదేశించారు.

పదిరోజుల పాటు జరిగే ఈ వైకుంఠ ద్వారదర్శనాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. సామాన్య భక్తులకు ఎక్కువ దర్శన సమయం కల్పించేందుకు జారీ చేసే టిక్కెట్ల కోటా, ఇతర అంశాలపై మరో రెండు వారాల్లో మరో సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. వైకుంఠ ఏకాదశికి తగిన పూల అలంకరణలు, వసతి, శ్రీవారి సేవకులు, స్కౌట్స్, ట్రాఫిక్ నిర్వహణ, పారిశుధ్యం తదితర అంశాలపై చర్చించారు.

సమావేశంలోని ముఖ్యాంశాలు

  • ఈ పది రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు (ప్రోటోకాల్ వీఐపీలు మినహా) రద్దు.
  • జనవరి 10 నుండి 19వ తేది వరకు వరకు 10 రోజుల పాటు చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, ఆర్మీ, ఎన్ఆర్ఐ దర్శనాలు రద్దు.
  • జనవరి 09 నుండి 19 వరకు ఆర్జిత సేవలు రద్దు
  • జనవరి 10న స్వర్ణ రధం ఊరేగింపు, 11న చక్ర స్నానం ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది.
  • మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో 10 రోజుల పాటు ఉదయం 6 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు అన్న ప్రసాదం పంపిణీ చేయబడుతుంది.

ఈ కార్యక్రమంలో సీవీఎస్‌వో శ్రీధర్‌, సీఈ శ్రీ సత్య నారాయణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement