తిరుపతి సిటీ, (ప్రభ న్యూస్) : తిరుపతి నగరంలో 9 చోట్ల వైకుంఠ ఏకాదశికి భక్తులకు టికెట్లు పంపిణీ కార్యక్రమాన్నిటీటీడీ చేపట్టింది. ఇందులో భాగంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ స్థానిక రామచంద్ర పుష్కరిణి వద్ద క్యూలైన్లో నిలబడి వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులతో కలిసి దర్శనం టికెట్లను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. తాను మాజీ ఎమ్మెల్యేను, వైకుంఠ దర్శనం కోసం టీటీడీ ఈవో, జేఈవో ఆఫీసులకు సిఫారసు చేసినా అధికారులు పట్టించుకోలేదన్నారు.
వీఐపీలకు, అధికార పార్టీలోని చిన్నచిన్న నాయకులకు ముందస్తుగా పాసులు అందజేస్తున్నారని ఆరోపించారు. తిరుపతికి 16 స్పెషల్ విమానాలలో వీఐపీలు వచ్చారని, కనీసం తిరుపతి మాజీ ఎమ్మెల్యే అయిన తనకు తన కుటుంబ సభ్యులకు పాసులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో తాము అందరినీ సమానంగా చూసామని, ఇట్లా వ్యవహరించలేదన్నారు.