ఆంధ్రప్రభ దినపత్రిక ప్రత్యేక కథనం..
ఆగస్టు నుంచి దేశీయంగా ఉత్పత్తి
టీకాల కొరత ఇక తీరినట్టే
అందరికీ వ్యాక్సిన్ సాధ్యమే
వచ్చేవారం నుంచి స్పుత్నిక్
భారత్ బయోటెక్ తో ఒప్పందాలు
ముందుకొచ్చిన రెండు పీఎస్‌యూలు
త్వరలో లూపిన్ వ్యాక్సిన్
రెమ్‌డెసివర్‌కు ప్రత్యామ్నాయం…
మార్కెట్లోకి వస్తోంది బాక్రిసిటినిబ్
విదేశీ కంపెనీలు సిద్ధం
భారీగా టీకాల ఉత్పత్తి
జాన్సన్, ఫైజర్‌లు కూడా…
ఐదు రకాల వ్యాక్సిన్‌లు రెడీ
ఫార్ములా పంచుతామన్న భారత్ బయోటెక్
టీకా ఉత్పత్తికి ముందుకొస్తే ఒక్కరోజులోనే అనుమతి
భారత్‌లో టీకాల లభ్యత రానున్న కాలంలో గణనీయంగా పెరగనుంది. ఈ ఏడాది డిసెంబర్ చివరినాటికి దేశీయంగా 216కోట్ల మోతాదుల వ్యాక్సిన్ ఉత్పత్తి కానుంది. రష్యా ఉత్పత్తయిన స్పుత్నిక్ వి వచ్చే వారం భారత్‌లోకి ప్రవేశించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వచ్చే వారం చివరి నాటికి దేశంలో మూడవ వ్యాక్సిన్‌గా ఇది అందుబాటులోకి రానుంది. ఈ నెలాఖరులోగా భారత్‌లో పౌరులకు స్పుత్నిక్ వి టీకాలేసేందుకు ప్రభుత్వం కూడా సంసిద్దమౌతోంది. జూలై నుంచి స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌లను భారత్ లోనే తయారు చేయనున్నారు. నెలకు 15.6కోట్ల మోతాదుల చొప్పున ఇవి ఉత్పత్తి కానున్నాయి. అలాగే ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలు కూడా భారత్‌లో తమ కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించాల్సిందిగా కేంద్రం కోరింది. క్వాడ్ ఒడంబడిక క్రింద జాన్సన్ అండ్ జాన్సన్ భారత్ సూచనకు తమ సమ్మతి తెలిపిం ది. ఒకట్రెండు మాసాల్లో జాన్సన్ అండ్ జాన్సన్ భారతీయ వ్యాక్సిన్ ఉత్పత్తిదార్లతో కలసి తన కోవిడ్ వ్యాక్సిన్‌ను తయారు చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఫైజర్ కూడా ఒకట్రెండ్రోజు ల్లో తన నిర్ణయాన్ని తెలిపేందుకు సమాయత్తమౌతోంది. దీంతో ఐదు రకాల వ్యాక్సిన్‌లు భారత్‌లోనే ఉత్పత్తయి దేశీయంగా అందుబాటులో కొస్తాయి. వీటితో పాటు మరికొన్ని వ్యాక్సిన్ ఉత్పాదక సంస్థల్ని కూడా భారత ప్రభుత్వం ఆహ్వానించింది. దేశీయంగా ఉత్పత్తికి దరఖాస్తులు చేస్తే ఒకట్రెండురోజుల్లోనే అనుమతులు జారీ చేస్తామంటూ హామీనిచ్చింది. ప్రస్తుతానికైతే కేంద్రం వద్ద ఏ ఒక్క దిగుమతి లైసెన్స్ దరఖాస్తు కూడా పెండింగ్‌లో లేదు. వచ్చే వారం నుంచి పరిమితంగా అందుబాటులోకొచ్చే స్పుత్నిక్ వి వ్యాక్సిన్ జూలై చివరి నాటికి పెద్దసంఖ్యలో మార్కెట్‌లోకి అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగితే డిసెంబర్ నాటికి దేశీయంగా అందరికి టీకాలు అందుబాటు లోకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా భారత్‌లో ఇప్పటి వరకు 18కోట్ల మోతాదుల టీకాలు మాత్రమే వినియోగించ బడ్డాయి. 45ఏళ్ళుపైబడ్డ జనాభాలో మూడింట ఒకవంతు మందికి మాత్రమే టీకాలు పూర్తయ్యాయి. అది కూడా ఒక డోసు మాత్రమే. టీకాలు నూరుశాతం పూర్తయితే కోవిడ్ మరణాల్ని 88శాతం వరకు తగ్గించే అవకాశాలుంటాయి.
ప్రస్తుతం దేశీయంగా కోవాగ్జిన్, కోవీషీల్ట్ టీకాలు మాత్రమే తయారౌతున్నాయి. కోవీషీల్ట్ గరిష్టంగా నెలకు 7కోట్ల డోసుల్ని సరఫరా చేయగలుగుతోంది. కాగా కోవాగ్జిన్ నెలకు గరిష్టంగా కోటి డోసుల్ని మాత్రమే అందించగలుగుతుంది. కేంద్ర ప్రభుత్వ మేథోసహకారంతో అభివృద్ది చేసిన కోవాగ్జిన్ ఉత్పత్తిని భారత్ బయోటెక్‌తో పాటు మరికొన్ని సంస్థలకు కూడా అప్పగించాలంటూ గతకొన్ని రోజులుగా కేంద్రంపై డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కూడా ఇలాంటి డిమాండ్‌ను లేవనె త్తారు. దీనిపై కొన్ని రాజకీయ వర్గాలు విమర్శలు సంధించాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సన్నిహితుడికి చెందిన సంస్థ కావడంతోనే భారత్ బయోటెక్ నుంచి కోవాగ్జిన్ తయారీ నియంత్రణ హక్కుల్ని బదలాయించాలన్న డిమాం డ్‌ను జగన్ లేవనెత్తుతున్నారంటూ మండిపడ్డాయి. అయితే దేశీయంగా వె ల్లువెత్తుతున్న ఈ డిమాండ్‌కు భారత్ బయోటెక్ కూడా సమ్మతించింది. మరో మూడు టీకా ఉత్పత్తి సంస్థల్తో కోవాగ్జిన్ ఫార్ములాను పంచుకోవడానికి బారత్ బయోటెక్ ముందుకొచ్చింది. ఇదే విషయాన్ని ఆ సంస్థ కేంద్ర వైద్యఆరోగ్యశాఖకు తెలియజేసింది. దీంతో కోవాగ్జిన్ ఉత్పత్తి మెరుగుదలకు మార్గాలు తెరుచుకున్నాయి. అవసరమైన మేరకు స్థానికంగానే టీకాల తయారీకి అవకాశాలు మెరుగ య్యాయి. ఇదే సమయంలో కోవీషీల్ట్ రెండో డోసు పొందేం దుకు కాలపరిమితిని పెంచుతూ భారత వైద్య పరిశోధన మండలి సూచనలు చేసింది.