మంత్రుల పేషీలు ఖాళీ చేయాలని, కీలక పత్రాలు, దస్త్రాల వంటివి తరలించొద్దని ఏపీ పరిపాలనా విభాగం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ (GAD) మంత్రుల పేషీలకు ఈ కీలక ఆదేశాలను గురువారం జారీ చేసింది. జూన్ 4న వెలువడనున్న ఎన్నికల ఫలితాలకు అయిదు రోజుల ముందే జీఏడీ ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం సంచలనం రేపుతోంది. జూన్ 2న మంత్రుల పేషీలు, చాంబర్లను స్వాధీనం చేసుకోవాలని కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ అయ్యాయి.
కాగా, సచివాలయం నుంచి ఎలాంటి సామగ్రి, అనుమతి పత్రాలు బయటకు తీసుకెళ్లొద్దని, మంత్రుల పేషీలు, ప్రభుత్వశాఖల్లోని దస్త్రాలు తరలించేందుకు వీల్లేదని జీఏడీ ఈ ఆదేశాల్లో సూచించింది. జూన్ 3న మంత్రుల పేషీలకు తాళాలు వేస్తామని తెలియజేసింది. కార్యాలయం నుంచి వెళ్లే వాహనాలను తనిఖీ చేయాలని ఎస్‌పీఎఫ్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. మంత్రుల పేషీలు తమ గదులను ఖాళీ చేయాలని కూడా జీఏడీ ఆదేశించింది.