2024లో వచ్చేది సంకీర్ణ, సుస్థిర ప్రభుత్వం. .. వైసీపీకి 15 సీట్లు వస్తే గొప్పే జగన్…. నీ పిల్ల వేషాలు మానుకుంటే మంచిది. ప్రజల దాహం తీర్చే గ్లాసు… వారిని గమ్యం చేర్చే సైకిల్ ఒక్కటయ్యాయి. కరెంటు ఛార్జీల దెబ్బకు ఫ్యాను తిరగడం ఆగిపోయింది … రాబోయే కురుక్షేత్రంలో వైసీపీ నేతలే కౌరవులు. . నిరుద్యోగ యువతకు అండగా నిలబడతాం… రైతుల పక్షాన పని చేసే బాధ్యత తీసుకుంటాను . . ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల మృతిపై సమాధానం చెప్పాలి .. నాదెండ్ల మనోహర్ లాంటి నిబద్ధత గల నాయకులను ఆహ్వానిస్తాం. . అవనిగడ్డలో వారాహి విజయ యాత్ర బహిరంగసభలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్
అవనిగడ్డ – ప్రజల దాహం తీర్చే గ్లాసు… ఆ ప్రజలను గమ్యం చేర్చే సైకిల్ ఒక్కటయ్యాయి. కరెంటు ఛార్జీల దెబ్బకు ఫ్యాను తిరగడం ఆగిపోయింది… రాష్ట్ర అభివృద్ధి ఆ ఆగిపోయిన ఫ్యానుకు ఉరి వేసుకుంది’ అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న వైసీపీ మహమ్మారికి జనసేన- తెలుగుదేశం పార్టీలే వ్యాక్సిన్ గా పని చేస్తాయని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం జనసేన, తెలుగుదేశం కూటమిని ప్రజలు ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఆలయాలను కూల్చేసే వైసీపీ మహమ్మారికి… పురోహితులను వేలం వేసే వైసీపీ మహమ్మారికి… రైతాంగాన్ని కన్నీరు పెట్టిస్తోన్న వైసీపీ మహమ్మారికి.. నిరుద్యోగులను నిలువునా ముంచేసిన వైసీపీ మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
వారాహి విజయయాత్ర నాలుగో విడతను ఆదివారం ఆయన అవనిగడ్డలో బహిరంగసభ ద్వారా మొదలుపెట్టారు. అశేష సంఖ్యలో ప్రజానీకం ఈ సభకు హాజరయ్యారు. జనసేన, టీడీపీ శ్రేణులు పవన్ ను ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సభలో ఆయన ప్రసంగిస్తూ “రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం జనసేన – తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికలకు వెళ్తాయి. సంకీర్ణ ప్రభుత్వం స్థాపించి తీరుతాం. జగన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు. 175కు 175 గెలుస్తామని మాట్లాడుతున్నాడు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు 15 సీట్లు వస్తే గొప్ప. రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ కూడా బింకాలు పలికేవాడు. యుద్ధంలో జర్మనీ గెలుస్తుందని చివరి వరకు ప్రజలను నమ్మించాడు. ప్రత్యర్థి దేశాల దళాలు బెర్లిన్ చేరుకోగానే బంకర్లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. 2024లో జగన్ పరిస్థితి కూడా అంతే. ..
కురుక్షేత్రంలో వైసీపీ నేతలే కౌరవులు
వచ్చే ఎన్నికలను కురక్షేత్ర యుద్ధంతో ముఖ్యమంత్రి పోలుస్తున్నాడు. మీరు కురుక్షేత్రంలో కౌరవులో, పాండవులో తేల్చుకోండి. 151 మంది మీరున్నారు కాబట్టి కచ్చితంగా వైసీపీ వారే కౌరవులే అని నేను భావిస్తాను. అలా కాకుండా జగన్ – కింగ్ జేమ్స్ బైబిల్ ను నమ్మితే ఒక విషయం గుర్తు చేస్తాను. ‘‘డేవిడ్ అండ్ గొలాయక్’’ కథలోని అహంకారపూరితమైన గొలాయక్ – 14 ఏళ్ల గొర్రెల కాపరి డేవిడ్ చేతిలో ఎలా చనిపోయాడో గుర్తుంచుకుంటే మంచిది. మీరు ఎన్ని కుయుక్తులు, పన్నాగాలు పన్నినా వైసీపీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయం. జగన్ గద్దె దిగడం డబుల్ ఖాయం. నిరుద్యోగులకు వచ్చే కొత్త ప్రభుత్వంలో న్యాయం జరగడం త్రిబుల్ ఖాయం. జగన్ ఏ కథ తీసుకున్నా పర్వాలేదు.. దానిలో ఓడిపోయే క్యారెక్టర్ మాత్రం జగన్ దే..
• జగన్ పారిపోయేలా చేద్దాంవైఎస్ఆర్ గారు పట్టువిడుపు ఉన్న రాజకీయ నాయకుడు. జగన్ కు అవి లేవు. మా వాడు బలవంతుడు.. మొండివాడు అని వైసీపీ నాయకులు అనుకోవచ్చు. వాళ్లు తెలుసుకోవాల్సింది అది ధైర్యం కాదు పిచ్చి. వైసీపీ నాయకులు మా నాయకులను తిట్టబోయే ముందు, కేసులు పెట్టబోయే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి. జగన్ ఉన్నాడని ఈ రోజు రెచ్చిపోతే రేపు మళ్లీ మిమ్మల్ని జనసేన పార్టీయే రక్షించాలి. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే మన ఆస్తులను దోచుకుంటారు. చిన్నస్థాయి వార్డు మెంబర్ కూడా మనల్ని బ్లాక్ మెయిల్ చేసి ఆస్తులు కాజేస్తాడు. ఏదైనా ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒరిజినల్స్ ప్రభుత్వం దగ్గర ఉంచాలి అంట? మన ఆస్తి పేపర్లు ప్రభుత్వం దగ్గర ఎందుకు ఉంచాలి? మత్స్యకారుల కడుపు కొట్టడానికి 217 జీవో తెచ్చారు. దాని ప్రతులు చింపేశాం. ఇప్పుడు ఆస్తులు దోచేయాలని చూస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో వైసీపీని ఇంటికి పంపించడమే జనసేన- తెలుగుదేశం పార్టీల ప్రధాన కర్తవ్యం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే. చంద్రబాబు గారిపై పెట్టిన కేసుల్లో ఆయన నిర్దోషిగా బయటకు వస్తారని ఆశిస్తున్నాను. రాష్ట్ర అభివృద్ధి కోసం జరుగుతున్న ఈ యుద్ధంలో జనసేన – తెలుగుదేశం పార్టీలను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం వదిలి పారిపోవాలి అని ప్రజలు మాట్లాడుతున్నారు. కృష్ణా నదిలా ఇక్కడే ఉందాం. జగనే రాష్ట్రం నుంచి పారిపోయేలా ఆయన్ను ఓడిద్దాం’’ అన్నారు
.
.