Saturday, November 23, 2024

Delhi | ఉత్తరాంధ్ర కులాలను జాతీయ ఓబీసీ జాబితాలో చేర్చాలి: ఎంపీ రామ్మోహన్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఉత్తరాంధ్రలో 5 కులాలను జాతీయ ఓబీసీ జాబితాలో చేర్చాలని జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్ హన్స్‌రాజ్ గంగారాం ఆహిర్‌ను తెలుగుదేశం ఎంపీ కే. రామ్మోహన్ నాయుడు మరోసారి కోరారు. బుధవారం ఢిల్లీలోని జాతీయ బీసీ కమిషన్ కార్యాలయంలో ఛైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన, ఈ ప్రక్రియలో పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గత 9 ఏళ్ళు గా ఉత్తరాంధ్రకు చెందిన 5 కులాలు శిష్టకరణాలు, కళింగ వైశ్యులు, సొండీ, అరవలు, తూర్పు కాపు కులాలు రాష్ట్రంలో బీసీ జాబితాలో ఉన్నాయని, వీటిని కేంద్రంలో ఓబీసీ జాబితాలో చేర్చాలని సుదీర్ఘం కాలంగా ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిపారు.

సెప్టెంబర్ 13న ఈ కులాల పెద్దలతో బీసీ కమిషన్ పబ్లిక్ హియరింగ్ నిర్వహించిందని, ఈ సమావేశం జరిగి నెల రోజులైంది కాబట్టి పురోగతి తెలుసుకునేందుకు వచ్చానని అన్నారు. 5 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని ఆయా కులాల తరఫున కమిషన్ ఛైర్మన్‌ను మరోసారి కోరినట్టు వెల్లడించారు. ఈ కులాలకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెప్పించుకొని ప్రక్రియ వేగవంతం చేస్తున్నామని ఛైర్మన్ తెలిపారని రామ్మోహన్ నాయుడు అన్నారు. సెప్టెంబర్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి చీఫ్ సెక్రటరీ, బీసీ వెల్ఫేర్ సెక్రటరీని ఆహ్వానించినప్పటికీ, అధికారులు హాజరుకాలేదని తెలిపారు. ఎందుకు సమావేశానికి హాజరు కాలేదో చెప్పాలంటూ కమిషన్ నోటీసులు ఇచ్చినట్టు ఛైర్మన్ తెలిపారని అన్నారు. సాధ్యమైనంతవరకు ఈ కులాలను ఓబీసీలో చేర్చే కార్యచరణ పూర్తి చేస్తానని చైర్మన్ హామీ ఇచ్చారని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement