Saturday, October 19, 2024

AP | నిందితులకు శిక్ష పడినప్పుడే బాధితులకు న్యాయం : ఎస్పీ సుబ్బరాయుడు

తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ) : న్యాయస్థానాల్లో నేరం రుజువై నిందితులకు శిక్ష పడినప్పుడే బాధితులకు న్యాయం జరిగినట్లని ఎస్పీ సుబ్బరాయుడు అన్నారు. స్థానిక పోలీస్ పెరేడ్ మైదానంలో శనివారం కోర్టు కానిస్టేబుళ్లు, కోర్ట్ మానిటరింగ్ సిస్టం అధికార సిబ్బందితో పెండింగ్ కేసుల స్థితిగతులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…

కేసు నమోదు చేయడం, నిందితులను అరెస్టు చేయడం, చార్జ్ షీటు వేయడం, ఒక ఎత్తు అయితే, కోర్టులో విధివిధానాలను సరిగ్గా పాటించి, కేసును నిరూపణ చేయడంలో కోర్టు కానిస్టేబుళ్లు కీలకంగా పనిచేస్తున్నారని అన్నారు. ప్రతి కేసు నిజాలను నిగ్గుతేల్చి చిత్తశుద్ధితో పనిచేసి బాధితులకు న్యాయం చేయవలసిన మహత్తర బాధ్యత కోర్టు కానిస్టేబుళ్లపై ఉందన్నారు.

పెండింగ్ కేసుల విచారణ వేగవంతం చేయండి..

నాన్ బెయిలబుల్ వారెంట్స్ పెండింగ్ లేకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎస్పీ సూచించారు. ఎన్ఐ యాక్ట్ కేసులపై, పాత పెండింగ్ కేసులపై శ్రద్ధ చూపి, వారెంట్లు జారీ చేయాలన్నారు. సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు పాత పెండింగ్ కేసుల విచారణ పూర్తి అయ్యేటట్లు పనిచేయలన్నారు.

పోలీసుల అలసత్వంతో కోర్టులో విచారణ పెండింగ్ లేకుండా కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు మానిటరింగ్ సిస్టం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి కేసు నిరూపణ అయ్యే విధంగా దర్యాప్తు అధికారులు సమగ్ర దర్యాప్తు చేసి, కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే ఆ రికార్డులను కోర్టు కానిస్టేబుళ్లు జాగ్రత్త పరచాలన్నారు. కేసు విచారణ సమయంలో సాక్షులు, సాక్షాధారాలు, రికార్డులను కోర్టు కానిస్టేబుళ్లు కోర్టులో పొందుపరచాలన్నారు.

- Advertisement -

రివార్డులు ఇస్తాం

దర్యాప్తు అధికారులు కేసు విచారణకు హాజరయ్యేలాగా కోర్టు కానిస్టేబుళ్లు, కోర్ట్ మానిటరింగ్ సిబ్బంది బాధ్యతాయుతంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. విధులను సమర్థవంతంగా నిర్వర్తించి, కేసులు నిరూపణ చేస్తూ బాధితులకు న్యాయం చేకూరేలా పని చేసి పోలీస్ శాఖ ప్రతిష్టతను ప్రజలలో పెంపొందింపజేయాలని దిశా నిర్దేశం చేశారు.

నిజాయితీగా పని చేసేవారికి రివార్డులు ఇస్తామని చెప్పారు. అలాగే చట్టాన్ని అతిక్రమించే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకట్రావు, సీఐలు సుబ్రహ్మణ్యం, వెంకటప్ప, కోర్టు లైజన్ ఆఫీసర్లు, కోర్టు కానిస్టేబుళ్లు, కోర్ట్ మానిటరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement