Wednesday, November 20, 2024

Water Disputes | కృష్ణా న‌ది జ‌లాల వినియోగం.. సీమ జిల్లాలకు కేంద్ర జీఓ ముప్పు!

తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో) : కృష్ణా నదీ జలాల వినియోగంపై పునః సమీక్ష అధికారం ఇస్తూ కేంద్ర ప్రభుత్వం గత వారం విడుదల చేసిన ఉత్తర్వు రాయలసీమ జిల్లాలకు పెను ముప్పుగా మారనున్నది. ఆ ఉత్తర్వుల ప్రకారం జలాల సమీక్ష జరిగితే రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికె కాక పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అవసరమైన నీళ్లు లభించని దుస్థితి ఏర్పడే ప్రమాదం ఉంటుంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గతంలో బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టిఎ‌ంసీల నీళ్లతో పాటు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ చేసిన అదనపు కేటాయింపుల పై కూడా సమీక్ష చేసి రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్తగా పంపకాలు చేసే అవకాశాన్ని ఈనెల 4వ తేదీన కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం వీలు కల్పిస్తోంది. ఆ నిర్ణయం అమలును ఆపివేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి ని పేడ చెవిన పెట్టి ఈ నెల 6 వ తేదీన కేంద్రం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ పేరుతో ఉత్తర్వులను కూడా జారీ చేసింది. ఆ ఉత్తర్వులలోని ముఖ్య అంశాలను పరిశీలిస్తే గోదావరి జలాలను పోలవరం ద్వారా కృష్ణా నదికి మళ్ళించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వినియోగించడం ద్వారా ఆదా అయ్యే కృష్ణా జలాలను రెండు తెలుగు రాష్ట్రాలకు పంచడానికి వీలు కలుగుతుంది.

వాస్తవానికి బచావత్ ట్రిబ్యునల్ ప్రాజక్టుల వారిగా నీటి పంపకం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టుల వారిగా చేసిన నీటినే ప్రామాణికంగా తీసుకుని, ఏ రాష్ట్రంలో నీటిని ఆ రాష్ట్ర హక్కుగా నిర్దేశించే హక్కు బ్రిజేష్ ట్రిబ్యునల్ కు ఉంది. తాజాగా విడుదల అయిన ఉత్తర్వులలో కొత్త టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ను కేంద్రం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు ఇచ్చింది. అంతర్ రాష్ట్ర జల వివాదాల చట్టం 1956 ప్రకారం నీటి పంపకం తిరిగతోడాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కాకుండా కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి సంబంధించిన కార్యక్రమాన్ని చేపట్టాలని ఇటు రాయలసీమ ఉద్యమ సంఘాలు , అటు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాయి.. కాననీ ఈ నియమాన్ని కూడా లెక్కచేయక కేంద్రం ఉత్తర్వులను విడుదల చేసింది.

- Advertisement -

ఇక రెండవ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కు సంబంధించిన నోట్ ను పరిశీలిస్తే పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టా కు మల్లించడం ద్వారా ఆదా అయ్యే 80 టి ఎం సి ల కృష్ణా జలాల వినియోగానికి కూడా గండి పడుతుంది. ఎందుకంటే గతంలో చేసుకున్న ఒప్పందం మేరకు ఇందులో 35 టి.ఎం.సి.లు కర్నాటక, మహారాష్ట్ర లకు పోతే మిగిలే కృష్ణా జలాలు 45 టి.ఎం.సి.లు మాత్రమే ఉంటాయి. పోలవరం ప్రాజెక్టుకు తెలంగాణ రాష్ట్రం అనుమతించింది అనే షరతులకు లోబడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం జరిగింది.‌ ఈ చట్టం ద్వారా పోలవరం ద్వారా ఆదా అయ్యే జలాలు ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణంలో ఉన్న తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టులకు హక్కుగా లభించాలి. కాని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులా ప్రకారం చూస్తే ఆ 45 టి ఎం సి లలో తెలంగాణకు 22.5 టిఎంసి నీరు కేటాయింపులు చేస్తే మిగిలేది 22.5 టిఎంసి లు మాత్రమే ఆంధ్రప్రదేశ్ కు వాటా గా వస్తాయి.

గతంలో కృష్ణా డెల్టా ఆధునీకరణ చేస్తే 29 టి.ఎం.సి. లు మిగులు తాయని, శ్రీశైలం రిజర్వాయర్ ఎగువన తెలంగాణలో ఉన్న భీమా ప్రాజెక్టు కు 20 టిఎంసి.లు, పులిచింతల రిజర్వాయర్ నీటి ఆవిరికి 9 టిఎంసి కేటాయింపులు చేసారు. ఆ మేరకు బీమా ప్రాజెక్టు కు 20 టి ఎం సి ల కేటాయింపులు చేస్తే మిగిలేది 2.5 టి.ఎం.సిలు మాత్రమే. అన్నిటిని మించి పోలవరం ప్రాజెక్టు ద్వారా ఆదా అయ్యే 80 టిఎంసి కృష్ణా జలాలు శ్రీశైలం రిజర్వాయర్ లోనికి రాకముందే వినియోగంచుకోవడం జరిగితే శ్రీశైలం రిజర్వాయర్ నీటి మట్టం పెరగక పోవడంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు నీరు లభించే రోజులు గణనీయంగా తగ్గిపోతాయి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని రాయలసీమ కు చెందిన ప్రజాప్రతినిధులు. రాజకీయ పక్షాలు తగురీతిలో స్పందించక పోతే రాయలసీమ భవిష్యత్తు కు ఉరితాడు బిగించడమే అవుతుందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు
బొజ్జా దశరథరామిరెడ్డి హెచ్చరిస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement