Saturday, September 7, 2024

AP | వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం.. మారుతీ తో ఇఫ్కో ఒప్పందం

అమరావతి, ఆంధ్రప్రభ : వ్యవసాయరంగంలో డ్రోన్ల వినియోగం సత్ఫలితాలిస్తున్న తరుణంలో భారత ఎరువుల కర్మాగార సహకార సంస్థ (ఇఫ్కో) ఏపీ, తెలంగాణ రైతాంగానికి తీపి కబురు అందించింది. రెండు రాష్ట్రాల్లో 5 లక్షల ఎకరాల్లో డ్రోన్‌ స్ప్రే చేసేందుకు మారుతీ డ్రోన్స్‌ కంపెనీతో భారీ ఒప్పందం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ ఉత్పాదకత, సామర్ధ్యాన్ని పెంపుదల చేసేందుకు వీలుగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఇఫ్కో ప్రకటించింది.

ఈ మేరకు హైదరాబాద్‌లో మారుతీ డ్రోన్స్‌ సహ వ్యవస్థపాకుడు సంజీవ్‌ కష్యప్‌, ఇఫ్కో ఐటీ సర్వీసెస్‌ జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌ కుమార్‌లు రాతపూర్వక ఒప్పందం కుదిరింది. రెండు సంస్థల మధ్య కుదిరిన ఈ వ్యూహాత్మక ఒప్పందంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయరంగంలో సరికొత్త సాంకేతి విప్లవానికి బీజం పడుతుందని ఈ సందర్భంగా ఇఫ్కో వెల్లడించింది.

ఈ ఒప్పందం ప్రకారం వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు ఇఫ్కో ఎంపిక చేసిన భూముల్లో మారుతీ డ్రోన్స్‌ సంస్థ డ్రోన్‌ సాంకేతికతలను ఉపయోగిస్తుంది. డ్రోన్ల ద్వారా ప్రస్తుతం అందుబాటు-లోకి వచ్చిన అన్నివ్యవసాయపనులను చేపడుతుంది. డ్రోన్లను కొనుగోలు చేయాలనుకునే రైతు సంఘాలకు ప్రభుత్వం నుంచి రాయితీలు అందించనున్నట్టు ఇఫ్కో ప్రకటించింది. ఒక ఎకరం విస్తీర్ణాన్ని యూనిట్‌గా తీసుకుని అతి స్వల్ప వ్యయంతో రైతులకు డ్రోన్‌ సేవలను అందించనుంది.

గ్రామీణ వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు క్షేత్రస్థాయిలో ఈ ఒప్పందం ద్వారా భాగస్వామ్యం కల్పించనున్నట్టు ఇఫ్కో వెల్లడించింది. రైతులు, డ్రోన్‌ యజమానులతో పాటు సర్వీస్‌ ప్రొవైడర్లు వ్యవసాయ భూమిలో పురుగుమందులను డ్రోన్ల ద్వారా స్ప్రే చేయించేందుకు మారుతీ డ్రోన్స్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఇఫ్కో కోరింది.

ఈ సందర్భంగా మారుతీ డ్రోన్స్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈవో ప్రేమ్‌ కుమార్‌ మాట్లాడుతూ నూటికి నూరు శాతం పర్యావరణ పరిరక్షణకు దోహడపడేలా సేవలందించనున్నట్టు తెలిపారు. రైతులకు పురుగుమందుల స్ప్రేతో సంబంధం లేకుండా చేయటం ద్వారా వారి ఆరోగ్య పరిరక్షణకు పూర్తి సహకారం అందిస్తున్నాం.. ఇఫ్కోతో 5 లక్షల ఎకరాల వ్యవసాయ భూమిలో సేవలందించేందుకు కుదుర్చుకున్న ఈ ఒప్పందం రెండు తెలుగు రాష్ట్రాల్లో సుస్థిర వ్యవసాయానికి బాటలు వేస్తుందని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement