- అభివృద్ధి పథంలో పయనించండి..
- ఐ.ఎస్. జగన్నాధపురం గ్రామంలో దీపం పథకాన్ని ప్రారంభించిన పవన్
- లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్ల పంపిణీ
- గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్న పవన్
- శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పవన్ పూజలు
- పవన్ తో వెన్నెల తల్లిదండ్రులు భేటీ
- వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న వెన్నెల
- న్యాయం చేయాలని పేరేంట్స్ వేడుకోలు
- తగిన న్యాయం చేస్తానని భరోసా
ద్వారకా తిరుమల – తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని నేటి నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కల్యాణ్.. ద్వారకా తిరుమల మండలం, ఐ.ఎస్. జగన్నాధపురం గ్రామంలో మహిళలకు దీపం-2 పథకం కింద ఇవాళ జరిగిన ఉచిత గ్యాస్ సిలెండర్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన లబ్దిదారులకు తొలి విడత గ్యాస్ సిలిండర్లను అందజేశారు..
అనంతరం ఆక్కడ ఏర్పాటు చేసిన గ్రామ సభకు హాజరైన మహిళలతో ముఖాముఖిగా మాట్లాడారు.. గ్రామస్థులకు ఇప్పటి వరకు అందుతున్న వివిధ పథకాల వివరాలను వారి నుంచి అడిగి తెలుసుకున్నారు పవన్.. ఇదే సమయంలో గ్రామంలోని పలు సమస్యలను పవన్ దృష్టికి తెచ్చారు మహిళలు.. దీంతో అక్కడే ఉన్న పంచాయితీ రాజ్ అధికారులను పిలిచి ఆ సమస్యలను పరిష్కరించవలసిందిగా ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుని అభివృద్ధి పథంలో పయనించాలని కోరారు..
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పవన్ పూజలు….
అంతకు ముందు పవన్ కల్యాణ్ ఏలూరు జిల్లాలోని ఐఎస్ జగన్నాథపురంలో పర్యటించారు. ఉదయం రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న పవన్ అక్కడి నుంచి కారులో ఐఎస్ జగన్నాథపురానికి చేరుకున్నారు. గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ యాగశాలలో నిర్వహించిన ధన్వంతరి హోమంలో పాల్గొన్నారు.
పవన్ తో వెన్నెల తల్లిదండ్రులు భేటి..
పదోతరగతి విద్యార్థి వెన్నెల తల్లిదండ్రులు మధురపూడి విమానాశ్రయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిశారు. తమ కుమార్తె విషయాన్ని పవన్ దృష్టికి వెన్నెల కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. వెన్నెల ఆత్మహత్యకు పాఠశాల యాజమాన్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ పవన్ ను వేడుకున్నారు..ఈ విషయంలో తప్పక న్యాయం చేస్తానని వారికి భరోసా ఇచ్చారు.
అసలేం జరిగింది..
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చెముడు లంకకు చెందిన వెన్నెల సెలవు రోజుల్లో పాఠశాల నిర్వహిస్తున్నారని డీఈఓకి ఫిర్యాదు చేసింది. విషయం తెలిసిన స్కూల్ కరెస్పాండెంట్ వెన్నెలను మందలించాడు. పదో తరగతి నువ్వు ఎలా పాస్ అవుతావో చూస్తానని బెదిరించాడు. దాంతో వెన్నెల ఆత్మహత్య చేసుకుంది. ఫిర్యాదు చేసిన పాపానికి పదో తరగతి నువ్వు ఏ రకంగా పాస్ అవుతావో చూస్తానని కరెస్పాండెంట్ బెదిరించిన కారణంగా వెన్నెల ఆత్మహత్య చేసుకుందని పవన్ కళ్యాణ్ దృష్టికి ఆమె కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. పవన్ ద్వారా తమకు న్యాయం జరుగుతుందని వెన్నెల కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీ షిరిడి సాయి విద్యానికేతన్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు పవన్ ను కోరారు.