తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ) : తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సుబ్బరాయుడు ప్రజలకు సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అక్టోబర్ 15 – 18వ తేదీ వరకు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రైల్వే అండర్ బ్రిడ్జిల కింద నీరు ఎక్కువగా ఉన్నప్పడు ఆ మార్గంలో వెళ్లొద్దని, పాత భవనాల్లో ఉండేవాళ్లు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని చెప్పారు. వరద ప్రవాహాలకు పిల్లలను దూరంగా ఉంచాలని తల్లిదండ్రులకు సూచించారు.
రెండున్నర అడుగుల ఎత్తున్న వరద ప్రవాహంలో కార్లు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపరాదని సూచించారు. తడిగా, నీటిలో ఉండే విద్యుత్ పరికరాలను తాకొద్దని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను వెంటనే నమ్మొద్దని, మొదటగా అవి వాస్తవమా కాదో నిర్ధరించుకోవాలని సూచించారు. అత్యవసర సాయం కోసం 112/80999 99977 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.