Friday, November 22, 2024

‘వారాహి’పై రచ్చ ! ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తున్న ప్రచార రథం.. రంగుపై రగడ

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: జనసేన అధినేత పవన్‌ కల్యాన్‌ ఎన్నికల ప్రచార రథంపై రగడ మొదలైంది. ఆ వాహనానికి వినియోగించిన గ్రీన్‌ రంగుపై అధికార వైకాపా నేతలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ట్విట్టర్‌ వేదికగా రంగుపై మొదలైన విమర్శలు రచ్చకు దారితీస్తున్నాయి. గతంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి ఎన్టీ రామారావు ఎన్నికల ప్రచారంలో కూడా తన వాహనానికి ఇదే తరహాలో గ్రీన్‌ రంగును ఉపయోగించారు. తాజాగా పవన్‌ కల్యాన్‌ కూడా వచ్చే ఎన్నికల యుద్ధానికి అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన ప్రచార రథాన్ని సిద్ధం చేశారు. అయితే, వాహనానికి ఉపయోగించిన రంగుపై అధికార పక్షం అభ్యంతరం వ్యక్తం చేయడంతోపాటు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రంగును వాడటానికి వీల్లేదని చెబుతోంది.

ఒక వేళ అదే రంగును ఉపయోగిస్తే వాహన రిజిస్ట్రేషన్‌ సమయంలోనైనా అధికారులు అభ్యంతరం చెబుతారంటున్నారు. అయితే, జనసేన మాత్రం ఎట్టిపరిస్తితుల్లోనూ వెనక్కు తగ్గేదే లేదని, అదే రంగుతో ఎన్నికల ప్రచారానికి వెళ్తామంటూ సవాల్‌ చేస్తోంది. దీంతో శుక్రవారం జనసేన, వైసీపీ నేతల మధ్య రంగుపై ట్విట్టర్‌ వేదికగా విమర్శల యుద్ధం మొదలైంది. అయితే, పవన్‌ కల్యాన్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో ఓ వైపు గ్రీన్‌ కలర్‌లో ఉన్న ప్రచార రథాన్ని, మరోవైపు మొక్కలను ఉంచుతూ పోస్టుచేశారు. దీనిపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఆయన తన ట్విట్టర్‌ ఖాతాలో శ్వాస తీసుకో..ప్యాకేజీ మానుకో అంటూ కౌంటర్‌ ట్వీట్‌ చేశారు. దీనిపై సోషల్‌ మీడియా వేదికగా ఇరు పార్టీల మధ్య విమర్శల యుద్ధం తారా స్థాయికి చేరింది.

- Advertisement -

వెనక్కు తగ్గేదే లేదంటున్న జనసేన

ప్రచార రథం విషయంలో వెనక్కి తగ్గేదే లేదంటూ జనసేన అదే వాహనాన్ని ఎన్నికల ప్రచారానికి సిద్ధం చేస్తోంది. నిబంధనల మేరకే వాహనాన్ని రూపొందించామని చెబుతోంది. వారాహి… రెడీ ఫర్‌ ఎలక్షన్‌ బ్యాటిల్‌. అంటూ పవన్‌ కల్యాణ్‌ తన ఎన్నికల ప్రచార రధాన్ని సిద్దం చేసుకున్నారు. వచ్చే ఎన్నికల కోసం ఈ ప్రచార వాహనాన్ని తయారు చేసారు. ప్రత్యేక వసతులు అందులో కల్పించారు. కొండగట్టు- ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద పూజలు చేసి వాహనం వినియోగించాలని నిర్ణయించారు. పార్టీ నేతలు ఈ వాహనం సిద్దం అవుతూనే షూటింగ్‌ లో ఉన్న పవన్‌ వద్దకు తీసుకెళ్లారు. తన ప్రచార రధం గురించి పవన్‌ స్వయంగా టీ-్వట్‌ చేసారు. ఈ వాహనానికి వారాహి అని నామకరణం చేసారు. ఇప్పుడు ఇదే వాహనం పైన ఒక వివాదం మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల్లోనూ ప్రచార రథంపైనే చర్చ జరుగుతోంది. రాజకీయ వర్గాల్లోనూ ఇదే అంశం హాట్‌ టాపిక్‌గా మారింది.

గతంలో ఎన్టీఆర్‌ రథానికి ఇదే రంగు

1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ నేత, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్‌ ఎన్నికల ప్రచారానికి సంబంధించి అప్పట్లో గ్రీన్‌ కలర్‌ వాహనాన్నే ప్రచార రథంగా ఉపయోగించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో విస్తృతంగా ఆరథంపై ప్రచార కార్యక్రమాలను బహిరంగ సభలను నిర్వహించారు. పవన్‌ కల్యాన్‌ కూడా అదే తరహాలో గ్రీన్‌ రంగుతో ప్రత్యేక వాహనాన్ని రూపొందించారు. అయితే, పవన్‌ కల్యాణ్‌ కోసం సిద్దచేసిన వారాహి పైన కొత్త వివాదం మొదలైంది. ఈ వాహనం మొత్తం యుద్ద వాహనం తరహాలో కనిపిస్తోంది. ఆధునిక సదుపాయాలు..ప్రత్యేక వసతులతో దీనిని సిద్దం చేసారు. ఇంకా చేయాల్సిన మార్పుల గురించి పవన్‌ సూచించారు. ఈ వాహనానికి వారాహి అమ్మవారి పేరుపెట్టారు. అన్ని దిక్కులను కాచే అమ్మవారిగా పురాణాలు చెబుతాయని జనసేన నేతలు వెల్లడించారు. ఈ వాహనం ద్వారా ప్రజల మధ్యకు ప్రచారానికి వెళ్లాలని పవన్‌ డిసైడ్‌ అయ్యారు. పవన్‌ ప్రచార రధం..వారాహి… రెడీ ఫర్‌ ఎలక్షన్‌ బ్యాటిల్‌ అంటూ పెద్ద ఎత్తన సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ వాహనం చూసిన తరువాత ఇప్పుడు కొన్ని అభ్యంతరాలు..ప్రభుత్వాల నిర్ణయాలు తెర మీదకు వస్తున్నాయి.

గ్రీన్‌ కలర్‌పై చర్చ

పవన్‌ కోసం సిద్దం చేసిన ఈ వాహనం కోసం ఆలివ్‌ గ్రీన్‌ కలర్‌ వినియోగించారు. వాహనం మొత్తం ఇదే రంగులో దర్శనమిస్తుంది. అయితే, నిబంధనల ప్రకారం రక్షణ రంగ వాహనాలకు తప్ప ఇతర ప్రైవేట్‌ వాహనాలకు ఈ రంగు వాడటంపై నిషేధం ఉంది. తాజాగా హిమాచల్‌ ప్రదేశ్‌ లోనూ అక్కడి ప్రభుత్వం ఇదే అంశం పైన ఉత్తర్వులు ఇచ్చింది. ఆలివ్‌ గ్రీన్‌ లో ఉన్న వాహనాలు వెంటనే రంగు మార్చాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో, ఇప్పుడు పవన్‌ వాహనం కూడా ఇదే రంగులో ఉండటంతో మార్పు తప్పదని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించి ఇంకా ఎటు-వంటి అధికార ప్రక్రియ పూర్తి కాలేదు. వాహన రిజిస్ట్రేష్రన్‌ సమయంలో ఈ రంగు వినియోగం పైన అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

అదే వాహనంపై ఎన్నికల యుద్ధానికి వెళ్లే యోచన

ఇటీవల చోటుచేసుకున్న పలు సంఘటనల నేపథ్యంలో పవన్‌ కల్యాన్‌ ఎన్నికల ప్రచారానికి ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే అన్ని సౌకర్యాలతో భారీ వాహనాన్ని సిద్ధం చేశారు. ఆవాహనానికి గ్రీన్‌ రంగును వేశారు. అయితే, ప్రస్తుతం ఆ రంగుపై అధికార పక్షం అభ్యంతరం వ్యక్తంచేస్తున్నప్పటికీ పవన్‌ మాత్రం ఎన్నికల ప్రచారానికి అదే వాహనంపై వెళ్లాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల యుద్ధానికి జనసేన సిద్ధం అనే సంకేతాన్ని జనసైనికులకు ఇచ్చేలా ఆవాహనాన్ని సిద్దం చేయడంతోపాటు ట్విట్టర్‌ వేదికగా ప్రచారాన్ని కూడా చేపట్టారు. ఈ విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని జనసేన వాదనను బట్టి చూస్తోంటే స్పష్టమౌతోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement