అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని 13 జిల్లాల స్థానంలో ఇటీవల కొత్తగా మరో 13 జిల్లాలను ఏర్పాటుచేసి మొత్తం 26 జిల్లాలుగా మార్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు మరియు గ్రామాల ఏర్పాటు అనేది అయాజిల్లా, రెవెన్యూ డివిజను, మండలం మరియు గ్రామాల ఏర్పాటుకు పూర్వము ఏర్పాటైన ప్రస్తుత పంచాయతీరాజ్ సంస్థల కాలావధి, అధికారపరిధి మరియు స్వరూపము అనే అంశాలు ఈ పదవీ కాలం పూర్తయ్యేంత వరకూ అదే విధంగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1994 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ గురువారం ప్రభుత్వం సభలో బిల్లు ప్రవేశపెట్టింది. అయితే, 1994 పంచాయతీరాజ్ చట్టంలోని 274వ అధికరణం తరువాత మార్పులు, చేర్పులు చేయలేదు. తాజాగా 274 ఏ(1) అధికరణంలో ఉన్నదానికి విరుద్ధంగా ఏమి ఉన్నప్పటికీ, గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు, జిల్లా ప్రజా పరిషత్తులు పున:వ్యవస్థీకరణ కారణంగా పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటును ప్రస్తుత పంచాయతీరాజ్ సంస్థల కాలావధి ముగిసిన తరువాత చేయనున్నారు.
ఉద్దేశాలు – కారణాలు..
ప్రజలకు మరింత చేరువగా ఉంటూ సంక్షేమ పథకాల ఫలాలను వారికి అందించడంలో భాగంగా ప్రభుత్వ వ్యవస్థలను మెరుగుపర్చేందుకు కొద్దిపాటి మార్పులతో అనేక పరిపాలనా చర్యలను ప్రస్తుత ప్రభుత్వం చేపట్టింది. గ్రామీణ ప్రాంతాలలోని ప్రతి 2 వేల కుటుంబాలకు మరియు పట్టణ ప్రాంతాల్లో ప్రతి 4 వేల కుటు-ంబాలకు గ్రామ మరియు వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు- చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 50 కుటుంబాలకు మరియు పట్టణ ప్రాంతాలలో ప్రతి 75 నుండి 100 కుటుంబాలకు వాలంటీరను నియమించడం జరిగింది. గ్రామ మరియు వార్డు సచివాలయాల పరిపాలక సంస్కరణలు, గ్రామ మరియు వార్డు వాలంటీరు వ్యవస్థలు ప్రభుత్వ పథకాల పంపిణీ వ్యవస్థలలో భారీ సానుకూల ప్రభావాన్ని చూపాయి. చాలా సులభముగా మరియు పారదర్శకతతో అర్హులైన లబ్దిదారులను ఎంపికచేయడం, అన్ని సంక్షేమ కార్యక్రమాలు, అవినీతిని రూపుమాపడం వంటి అనేక కార్యక్రమాలతోపాటు ప్రజలకు మరింత సౌకర్యవంతంమైన పరిపాలను అందించడంలో ప్రముఖ పాత్రను పోషించాయి. అలాగే పరిపాలక సంస్కరణల కొనసాగింపులో భాగంగా జిల్లాలు, రెవెన్యూ డివిజన్లలను పునర్వ్యవస్థీకరించాలనే ఉద్దేశ్యాన్ని ప్రభుత్వం తీసుకుంది.
ఈసంస్కరణ, మరింత సమర్థవంతమైన రీతిలో పరిపాలక ఫలాలను అందుకోవడానికి రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి సహాయపడుతుందని ప్రభుత్వం ఆశించి ఈ బిల్లను రూపొందించింది. 2021వ సంవత్సరంలో రాష్ట్రం ఏర్పాటు చేయబడిన పంచాయతీరాజ్ సంస్థలు, అవి ఏర్పాటు అయిన తేదీ నుండి వాటి యొక్క పదవీకాలము ఐదు సంవత్సరాల వరకు ఉన్నది. వివిధ కేటగిరీల జనాభా కూర్పు మరియు ఆయా పంచాయతీ యూనిట్లలో రిజర్వేషన్ల ఆధారంగా పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటు జరిగింది. అలాగే జిల్లాలు/ రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణపై ఆధారపడి పంచాయతీరాజ్ సంస్థలను తక్షణమే పునర్ నిర్మించడం సాధ్యం కాకపోవచ్చు. రాష్ట్రంలో జిల్లాలు, రెవెన్యూ డివిజన్లలను పునర్వ్యవస్థీకరించిన ఫలితముగా, పునర్ నిర్మించబడిన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లలలో పంచాయతీరాజ్ సంస్థల అధికారిక పరిధిని సూచించవలసిన అవసరం ఉన్నది. ఆ ప్రకారంగా ప్రస్తుత పంచాయతీరాజ్ సంస్థల పదవీకాలం పూర్తి అయ్యేవరకు ప్రస్తుతం ఉన్న ఏర్పాటుకు భంగం కలిగించరాదని భావించి ఈ బిల్లను ప్రవేశపె ట్టారు.