కందుకూరు రూరల్, ప్రభన్యూస్ : మామిడి ధర ఈసారి చుక్కల్లో చేరనుంది. దిగుబడి పెద్ద ఎత్తున పడిపోవడంతో ధరలు పైపైకి వెళ్లడం కనిపిస్తోంది. నెల్లూరు జిల్లాలో ఈ సారి 20 నుంచి 30 శాతం లోపు మామిడి పంట దిగుబడి వచ్చే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లాలో సుమారు 32 వేల ఎకరాల్లో మామిడి విస్తీర్ణం ఉంది. ఇందులో ప్రకాశం నుంచి నెల్లూరు జిల్లాలో చేరిన కందుకూరు, ఉలవపాడు ప్రాంతాల్లో దాదాపు 15వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలోని కావలి, వింజమూరు, పాటూరు, ఇందుకూరుపేట, పొదలకూరు, ఆత్మకూరు ప్రాంతాల్లో మరో 17వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లోను చీడపీడలు అనిచ్ఛిత వాతావరణం వల్ల మామిడి పంట దెబ్బతింది. తామరపురుగు, తేనెమంచుపురుగు, మామిడితోటలను పూతదశలోనే దెబ్బతీశాయి. పిందెలు పడకుండానే పూతలు రాలిపోయాయి. వాతావరణంలో ఆసాధారణ హెచ్చుతగ్గులు సైతం మామిడి పూతలను దెబ్బతీశాయి. పిందెపాటును తగ్గించాయి. దీంతో అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రమే మామిడి పిందెలు దండిగా పడ్డాయి. మిగిలిన తోటలు వెలవెలపోతున్నాయి. ప్రత్యేకించి మామిడితోటలను బంగినపల్లి రకం మామిడి కాపు తీవ్రంగా దెబ్బతింది.
నెల్లూరు జిల్లాలోని మామిడితోటలను 80 శాతం చెట్లు బంగినపల్లి రకానివే. మధుర ఫలంగా పేరు పొందిన మామిడి పండులో బంగినపల్లి రకానికే ఆదరణ అధికం. మిగిలిన రకాల్లో బెంగుళూరు (అంటు మామిడి), పెద్ద రసం, చెరుకురసం, సువర్ణరేఖ, వంటి మామిళ్ల చెట్లు 20శాతం లోపే ఉన్నాయి. ప్రతి కూల పరిస్థితుల వల్ల మామిడితోటల ఫలసాయం ముందుగానే కొనుగోలు చేసిన వ్యాపారులు ఇప్పటికే నష్టపోయారు. నెల్లూరు జిల్లాలోని మామిడితోటల రైతుల్లో 90 శాతం మంది తమ తోటల ఫలసాయాన్ని పూతలు రాకమునుపే విక్రయిస్తారు. క్రిమిసంహారక మందులు పిచికారి వంటి బాధ్యతలను వ్యాపారులే చూసుకుంటారు. ఈ సీజన్‌లో వ్యాపారులు ఎకరా మామిడి ఫలసాయాన్ని 20 నుంచి 70వేల రూపాయల ధరకు రైతుల నుంచి ముందుగా కొనుగోలు చేశారు. తీరా చూస్తే ఇప్పుడు పంట విఫలం కావడంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. సాధారణంగా ఈ ప్రాంతంలో సగటున ఎకరానికి ఐదు టన్నుల మామిడి పంట దిగుబడి వస్తుంది. ఈలెక్కన నెల్లూ రు జిల్లాలో లక్ష 60వేల టన్నుల పంట దిగుబడి రావాల్సింది. కాని ఈసారి మామిడి పంట దిగుబడి 30 నుంచి 42వేల టన్నుల లోపే ఉండవచ్చని అంచనా. పంట దిగు బడి భారీగా తగ్గనుండటంతో ఇతర ప్రాంతాల వ్యాపారులు ఉలవపాడు, గుడ్లూరు, వింజమూరు, కావలి, వంటి ప్రాంతాల్లో పంట ఓ మోస్త్తరుగా ఉన్న మామి డితోటలను తిరిగి కొనుగోలు చేస్తున్నారు. బంగినపల్లి కాయల ధర టన్నుకు 40 నుంచి 50వేలు పలకవచ్చునని అంచనాతో వ్యాపారులు ముందుకు వస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..