Saturday, November 23, 2024

వీఐటీలో ఘనంగా విశ్వవిద్యాలయ దినోత్సవం.. ముఖ్య అతిథిగా మంత్రి రజని

అమరావతి, ఆంధ్రప్రభ: వీఐటీ ఏపీ విశ్వవిద్యాలయంలో విశ్వవిద్యాలయ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని, గౌరవ అతిథులుగా ఎమ్మెల్యే వుండవల్లి శ్రీదేవి, ష్నీడర్‌ ఎలక్ట్రిక్‌ డైరెక్టర్‌ వెంకటరమణన్‌ వేణుగోపాల్‌ హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి రజని విశ్వవిద్యాలయ వార్షిక నివేదికను ఆవిష్కరించారు. అనంతరం మహాత్మాగాంధీ అకడెమిక్‌ బ్లాక్‌లోని ఇన్నోవేషన్‌ అండ్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌, సెంటర్స్‌ అఫ్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ రోబోటిక్స్‌, ఇంటర్నెట్‌ అఫ్‌ థింగ్స్‌, సైబర్‌ సెక్యూరిటీలను ప్రారభించారు. మంత్రి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి జీవితంలో కొన్ని లక్ష్యాలను పెట్టుకొని, వాటిని సాధించేందుకు కృషి చేసి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యమిస్తోందని, అందులో భాగంగా అనేక పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. వీఐటీ ఏపీ విశ్వవిద్యాలయ రెండో గ్రాడ్యుయేషన్‌ బ్యాచ్‌ విద్యార్థులు 635 సూపర్‌ డ్రీం, డ్రీం ఆఫర్లతో మొత్తం 1321 ప్లేస్‌మెంట్‌ ఆఫర్లను సాధించటం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే వుండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ గురువుల ప్రాముఖ్యతను వివరించారు. వీఐటీ అంటే విజన్‌, ఇన్నోవేషన్‌, ట్రాన్స్‌ఫర్మేషన్‌ అని పేర్కొన్నారు. వెంకటరమణన్‌ వేణుగోపాల్‌ మాట్లాడుతూ నేటి వైఫల్యాలే రేపటి విజయాలకు సోపానాలని, కాబట్టి ఓడిపోయినా ధైర్యంతో ముందుకు సాగితే విజయాలు సాధించవచ్చని స్ఫూర్తినిచ్చారు.

ఖాళీ సమయాలలో కొత్త విషయాలు నేర్చుకోవటం, పుస్తకపఠనం చేయటం వల్ల ఒత్తిడిని జయించవచ్చని సూచించారు. వీఐటీ వ్యవస్థాపకుడు, ఛాన్సలర్‌ డా. జి. విశ్వనాథన్‌ మాట్లాడుతూ వీఐటీ 4 క్యాంపస్‌లలో దాదాపు 65 వేల మంది విద్యార్థులు చదువుతున్నారని, అత్యుత్తమ విద్యావిధానాలు, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్యను అందిస్తున్నామని, విద్యార్థులు సాధిస్తున్న విజయాలే ఇందుకు నిదర్శనమని తెలిపారు. వీఐటీ- ఏపీ విశ్వవిద్యాలయంలో 28 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాలు, 9 దేశాల నుంచి 7888 మంది విద్యార్థులు, 23 రాష్ట్రాలు, విదేశాల నుంచి అధ్యాపకులతో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు కలిగి ఉండటం సంతోషంగా ఉందని అన్నారు.

81 క్లబ్బులు, చాప్టర్‌లతో విద్యార్థులను ఆచరణాత్మకమైన జ్ఞానాన్ని పొందటానికి, సమగ్ర విద్యను అందించటానికి చేస్తున్న కృషిని అభినందించారు. ఇన్నోవేషన్‌ అండ్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ను 10 వేల చదరపు అడుగుల్లో ఏర్పాటు- చేశామని, ఇందులో 6 స్టార్టప్‌లు(ఎనర్జీ ఎఫిషియెంట్‌ బైక్‌, ఆటోమేటిక్‌ వాటర్‌ లెవెల్‌ కంట్రోలర్‌, ముఖం ఆప్‌, స్మార్ట్‌ ఆగ్రో, సోషల్‌ డిస్టెన్సిన్గ్‌ అలెర్ట్‌ సిస్టం, యాంటీ సూసైడ్‌ ఫ్యాన్‌ రాడ్‌) ఉన్నాయని వివరించారు. వైస్‌ ప్రెసిడెంట్‌ శంకర్‌ విశ్వనాథన్‌ మాట్లాడుతూ 148 అకడెమిక్‌ అవార్డులు, 13 ఎండోమెంట్‌ అవార్డులు, 143 అధ్యాపకులకు, రీసెర్చ్‌ స్కాలర్లకు రీసెర్చ్‌ అవార్డులు, 42 పెర్ఫార్మన్స్‌ అవార్డులు సాధించిన విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందిని ప్రశంసించారు ఐదేళ్ల సర్వీస్‌ పూర్తిచేసిన 31 మంది అధ్యాపకులు, ముగ్గురు సిబ్బందిని సత్కరించారు. విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ డా. ఎస్వీ కోటా రెడ్డి వార్షిక నివేదికను చదివి ప్రగతిని వివరించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ డా. సీఎల్వీ శివకుమార్‌, డిప్యూటీ- డైరెక్టర్‌(స్టూడెంట్‌ వెల్ఫేర్‌) డా. అనుపమ నంబూరు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement