అమరావతి, ఆంధ్రప్రభ : దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితులవల్ల విద్యుత్ డిమాండు విపరీతంగా పెరిగినప్పటికీ రాష్ట్రంలో, గృహ, వ్యవసాయ వినియోగదారులకు పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రకటించాయి. డిమాండు – సరఫరా మధ్య స్వల్ప అంతరం ఏర్పడిన సమయాల్లో పారిశ్రామిక రంగానికి స్వల్పంగా విద్యుత్ సరఫరా తగ్గించి గృహ, వ్యవసాయ వినియోగదారులకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు డిస్కంలు సోమవారం స్పష్టం చేశాయి. ఆదివారం రాష్ట్రంలో మొత్తం 206.5 మిలియన్ యూనిట్ల సరఫరా జరిగిందని, విద్యుత్ సరఫరాలో ఏవిధమైన అంతరాయాలు కానీ లోడ్ షెడ్డింగ్ కానీ లేదని అధికారులు పేర్కొన్నారు.
సెప్టెంబర్ 1వ తేదీన అప్పుడు రాష్ట్రంలో నెలకొన్న గ్రిడ్ డిమాండ్ – సరఫరా పరిస్థితులను బట్టి రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి కొద్ది మేర విద్యుత్ సరఫరా తగ్గించి, అది గృహ, వ్యవసాయ రంగాలను ప్రాధాన్యతా రంగాలుగా పరిగణించి అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ సంస్థలు భావించాయని తెలిపారు. దానికి అనుగుణంగా కమిషన్‌కు అభ్యర్ధన పంపామని వివరించారు. విద్యుత్ పంపిణి సంస్థల అభ్యర్ధన మేరకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈనెల2వ తేదీన రాష్ట్రంలో 5వ తేదీ నుంచి పారిశ్రామిక రంగానికి స్వల్పంగా విద్యుత్ వాడకంలో పరిమితులు విధించవచ్చని ఆదేశాలు ఇచ్చారు.
మారిన పరిస్థితులకనుగుణంగా
మారిన వాతావరణ పరిస్థితులు, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న అల్పపీడన పరిస్థితులతో పడుతున్న వర్షాల దృష్ట్యా గ్రిడ్ డిమాండ్ కొంత మేర తగ్గింది. గత రెండు రోజులుగా ఎటు-వంటి విద్యుత్ కొరత లేదు. విద్యుత్ సౌధలో సోమవారం ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్ నేతృత్వంలో రాబోయే రెండు వారాలపాటు విద్యుత్ సరఫరా పరిస్థితిపైఅధికారులతో కూలంకషంగా సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం లోడ్ కొద్దిమేర తగ్గి సరఫరా పరిస్థితి మెరుగుపడి నందువల్ల పారిశ్రామిక వినియోగదారులకు అధికారిక లోడ్ షెడ్డింగ్ విధించే అవసరం కలగదని భావించడంతో విద్యుత్ పంపిణీ సంస్థలు పారిశ్రామిక రంగానికి విద్యుత్ వాడక పరిమితి నిబంధనల అమలును రద్దు చేసుకున్నాయి.
కాబట్టి వినియోగదారులందరు ఈవిషయాన్ని గ్రహించాలని డిస్కంల అధికారులు కోరారు. రాష్ట్రంలో ఏవిధమైన లోడ్ షెడ్డింగ్ కానీ, విద్యుత్ వాడకంలో పరిమితులు కానీ లేవని స్పష్టంచేశారు. మెరుగుపడిన సరఫరా పరిస్థితి వల్ల కమిషన్ ఇచ్చిన పారిశ్రామిక విద్యుత్ వాడకంలో పరిమితి – నియంత్రణ ఉత్తర్వులను అమలు చేయడం లేదని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని కమిషన్‌కు కూడా నివేదించడానికి పంపిణి సంస్థలు నిర్ణయం తీసుకున్నాయని తెలిపారు.
సెప్టెంబర్ నెల 15 వ తేదీ వరకు స్వల్పకాలీక మార్కెట్టు నుండి రోజుకి దాదాపు 40 మిలియన్ యూనిట్లు ప్రతీ యూనిట్‌కు రూ. 9.10 వెచ్చించి వినియోగదారుల సౌకర్యార్ధం కొనడం జరుగుతోందని తెలిపారు. సరఫరా పరిస్థితి అదుపు తప్పకుండా నిరంతరాయంగా అధికారులందరూ అప్రమత్తంగా వున్నారని వెల్లడించారు. ప్రజలకు ఎటు-వంటి ఇబ్బంది తలెత్తకుండా గృహ, వ్యవసాయ, వాణిజ్య – పారిశ్రామిక రంగాలకు సరఫరా అంతరాయం లేకుండా చేయడానికి శాయశక్తులా కృషి చేస్తున్నామని తెలిపారు.