అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని దేవాదాయశాఖ మొద్దునిద్ర వీడటం లేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని జిల్లాల పునర్విభజన చేస్తే.. ఇప్పటి వరకు ఉద్యోగుల సర్థుబాటులో విధివిధానాలు పాటించకపోవడం ఆ శాఖ నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది. అధికారులు, ఉద్యోగుల విభజనలో దేవాదాయశాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో సకాలంలో జీతాలు అందని పరిస్థితి నెలకొన్నది. జీతాల బిల్లులకు ట్రజరీ అధికారులు కొర్రీలు వేయడంతో పాత అధికారులను ఇన్చార్జిలుగా చూపుతూ అధికారులు జీతాలు డ్రా చేయాల్సి వచ్చింది. రెండు నెలల పాటు సమస్యను పరిష్కరించకుండా పక్కనబడేసి ఇప్పుడు హడావుడిగా నిబంధనలకు విరుద్ద నిర్ణయాలు తీసుకోవడం పలువురు ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలను పునర్విభజిస్తూ ఏప్రిల్ 4న ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు ముందున్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు అన్ని శాఖల అధికారులు అధికారులు, ఉద్యోగుల విభజన చేశారు. ప్రభుత్వం కేడర్ స్ట్రంత్ (ఉద్యోగుల కేటాయింపు) ఇవ్వకపోవడంతో ఆయా జిల్లాల్లోని పరిస్థితిని బట్టి సంబంధిత శాఖలు సర్థుబాటు చేసుకున్నాయి.
అప్పటికే విధులు నిర్వహిస్తున్న అధికారులు పాత జిల్లాల్లో కొనసాగుతూ కొత్త జిల్లాలకు అధికారులు, సిబ్బందిని సర్థుబాటు చేసే బాధ్యతలను అప్పగించారు. ఇతర శాఖల్లో అదేరీతిలో జరిగింది. దేవదాయశాఖలో కూడా ఉద్యోగుల విభజన చేసినట్లు తూతూ మంత్రంగా కాగితాలపై పేర్కొన్నారు తప్ప నిబంధనల మేరకు చేయలేదని ఇటీవల ఎదురవుతున్న సమస్యలను బట్టి స్పష్టం అవుతోంది. దీంతో అన్ని జిల్లాల్లో ఇప్పుడు సమస్య తలెత్తుతోంది.
ఏం జరిగింది..
జిల్లా విభజన జరిగిన నెల కావడంతో ప్రభుత్వం పాత విధానంలోనే అన్ని జిల్లాలకు జీతాలు చెల్లించేలా ట్రజరీలకు ఆదేశాలు జారీ చేసింది. మే నెలలో డ్రాయింగ్ అధికారుల సమస్య తలెత్తడంతో జీతాలు చెల్లించేందుకు ట్రజరీ అధికారులు నిరాకరించారు. దీంతో చేసేది లేక ఉన్నతాధికారులు గత డ్రాయింగ్ అధికారులనే ఇన్చార్జిలుగా పేర్కొంటూ ఉత్తర్వులు ఇవ్వడంతో ఎట్టకేలకు నెల మొదట్లో రావాల్సిన జీతాలు వారం రోజులు ఆలస్యంగా అందాయి. జూన్ నెల జీతాలకు సంబంధించి ఇప్పుడే విధంగా ముందుకెళ్లాలా? అనే దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోసారి సమగ్రంగా ఉత్తర్వులు జారీ చేసి కొత్త ట్రజరీ కోడ్‌తో జీతాలు తీసుకునేందుకు అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది.
ఎందుకీ తొందరపాటు..
అస్మదీయులకు మంచి పోస్టింగ్ ఇవ్వాలనే ఉన్నతాధికారుల నిర్ణయమే ఇప్పుడీ పరిస్థితికి కారణమని తెలిసింది. పాత కృష్ణాజిల్లాను ఉదాహరణగా తీసుకుంటే రెండుగా విభజించి కొత్తగా ఎన్టీఆర్ విజయవాడ జిల్లాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాస్తవానికి ఇప్పటి వరకు దేవాదాయశాఖ ఏసీగా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ పాత జిల్లాకు ఏసీగా వెళ్లాల్సి ఉంది. అయితే దేవాదాయశాఖ ఏసీ కార్యాలయం విజయవాడలోనే ఉందనే కారణంతో ఆయన ఎన్టీఆర్ విజయవాడ జిల్లా ఏసీగానే కొనసాగుతున్నారు. ఇదే సమయంలో కొత్త జిల్లాకు సూపరింటెండెంట్‌ను అధికారిగా చూపుతూ ఉత్తర్వులు జారీ చేయడం, పాత కృష్ణాజిల్లాకు జిల్లా దేవాదాయశాఖ అధికారి(డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్) గా హరిగోపీనాధ్ను చూపడంతో జీతాల సమస్య తలెత్తింది. ట్రజరీ అధికారులు జీతాలు చెల్లించేందుకు నిరాకరించడంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని పాత అధికారినే ఇన్చార్జిగా చూపుతూ మరో ఉత్తర్వులు ఇవ్వడంతో ఎట్టకేలక ట్రజరీ అధికారులు అంగీకరించారు. వాస్తవానికి కృష్ణాజిల్లా డీఈవో(డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్)గా హరిగోపీనాధ్కు బాధ్యతలు ఇచ్చిన వెంటనే అందుకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేసిన పక్షంలో ఇప్పుడీ సమస్య తలెత్తేది కాదని చెపుతున్నారు. ఇదే తరహాలో పలు జిల్లాల్లో సమస్య నెలకొని అధికారులు, ఉద్యోగులు సకాలంలో జీతాలు అందుకోలేకపోయారు. జిల్లాల పునర్విభజన తర్వాత ప్రభుత్వ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకొని అధికారులు, ఉద్యోగుల కేటాయింపు సక్రమంగా చేయపోవడమే సమస్యకు కారణమని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. తప్పుల మీద తప్పులు చేయడం షరా మామూలుగా మారిన దేవదాయశాఖ ఉన్నతాధికారులు ఇలాంటి అంశాలను సైతం తేలిగ్గా తీసుకోవడంపై ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.