Saturday, November 23, 2024

ఆన్‌లైన్‌ సినిమా టెక్కెట్లపై వీడని సస్పెన్స్‌, ముగిసిన వాదనలు.. రేపు హైకోర్టు నిర్ణయం

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్లలో ఆన్‌లైన్‌ సినిమా టిక్కెట్ల ధరల వ్యవహారంపై నెలకొన్న సస్పెన్స్‌ వీడలేదు. దీనిపై జూలై 1వ తేదీన తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు ప్రకటించింది. వచ్చేనెల 27వ తేదీన తుది విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సినిమా టిక్కెట్లను ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎఫ్‌డీసీ) ద్వారా విక్రయించాలంటూ ప్రభుత్వం చేసిన చట్ట సవరణలు, అందుకు అనుబంధంగా జారీచేసిన జీవోలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ బుక్‌ మై షో, మల్టిdప్లక్స్‌ థియేటర్ల అసోసియేషన్‌, విజయవాడ ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్లు వేర్వేరుగా అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేశాయి. ఈ వ్యాజ్యాలపై బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది.

బుక్‌మై షో తరుపు సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ జోక్యం చేసుకుంటూ ప్రభుత్వం రెండు శాతం సర్వీస్‌ చార్జీ చెల్లించాలని జారీచేసిన ఆదేశాలే తమకు అభ్యంతరకరమని కోర్టుకు నివేదించారు. రెండుశాతం సర్వీసు చార్జీ వల్ల టిక్కెట్లను ఎక్కువ ధరకు విక్రయించాల్సి వస్తుందన్నారు. దీనికితోడు కన్వీనియన్స్‌ చార్జీలను కలిపితే ప్రేక్షకులపై మరింత భారం పడుతుందన్నారు. ధరల పెంపుతో వినియోగదారులు కేవలం రెండు శాతం మాత్రమే సర్వీసు చార్జి చెల్లించి ఏపీఎఫ్‌డీసీ పోర్టల్‌ ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేసే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం వ్యాపారంలో తమతో పోటీకి దిగుతోందని వివరించారు. వ్యాపారంలో పోటీకి తమకెలాంటి అభ్యంతరంలేదని రెండు శాతం సర్వీస్‌ చార్జీ నిబంధనలను సవరించేలా మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయాలని కోరారు.

అయితే ధర్మాసనం ఈ వాదనతో ఏకీభవించలేదు. థియేటర్లు కన్వీనియన్స్‌ చార్జీలు వసూలు చేస్తున్నాయి.. ప్రభుత్వం అది చేయట్లేదు.. అందువల్ల తక్కువ ధరకు టిక్కెట్లు దొరుకుతాయి. మీకు వచ్చిన ఇబ్బందల్లా ఇదే కదా అని ప్రశ్నించింది. మల్టిప్లక్స్‌ థియేటర్ల అసోసియేషన్‌ తరుపున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. టిక్కెట్ల అమ్మకానికి సంబంధించి థియేటర్లకు సొంత సాఫ్ట్‌వేర్‌, సిబ్బంది ఉన్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ పోర్టల్‌తో అనుసంధానమైతే సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌ వేర్‌లో మార్పులు, చేర్పులతో పాటు అందుకు అవసరమైన సిబ్బందిని నియమించుకోవటం తలకు మించిన భారంగా మారుతుందన్నారు. ఆన్‌లైన్‌ పోర్టల్‌ను అమలు చేసేందుకు పన్నుల ఎగవేతే కారణంగా చెబుతున్న ప్రభుత్వానికి అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఒప్పందాల ద్వారా తమ వ్యాపారాల్లో ప్రభుత్వ జోక్యాన్ని నియంత్రించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

విజయవాడ ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ తరుపున న్యాయవాది ఎన్‌ అశ్వనీకుమార్‌ స్పందిస్తూ ప్రభుత్వ విధానాల వల్ల తాము స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే పరిస్థితులు లేవన్నారు. ప్రభుత్వం థియేటర్లలో ఉంటే తాము కేవలం క్యాంటీన్‌, పార్కింగ్‌ కే పరిమితం కావాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌ శ్రీరాం వాదిస్తూ అత్యధికశాతం మంది వ్యాపారులు నూతన విధానాన్ని అంగీకరిస్తున్నారని తెలిపారు. దీన్ని నియంత్రించేందుకు అవసరమైన ప్రాథమిక ఆధారాలను కూడా పిటిషనర్లు కోర్టుకు అందించలేదని వివరించారు. అందరి సలహాలు, సూచనల మేరకే ఈ విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయరాదని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వల నిమిత్తం దాఖలైన అనుబంధ పిటిషన్లపై జూలై 1వ తేదీన నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించింది. నూతన విధానాన్ని కొద్దిరోజులు ఆపినందువల్ల జరిగే నష్టమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సవరణ నిబంధనలు, జీవోల రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్లపై జూలై 27న తుది విచారణ జరుపుతామని వాయిదా వేసింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement