Friday, November 22, 2024

అన్నదాతకు అనుకోని కష్టం.. నేలకొరిగిన వరి పంట‌..

విజయనగరం, (ప్రభ న్యూస్‌) : వాయుగుండం ప్రభావంతో గత‌ నాలుగు రోజులుగా అడపాదడపా కురిసిన వర్షాలు అన్నదాతకు అనుకోని కష్టం తెచ్చిపెట్టాయి. వేల ఎకరాల్లో వరి పంట పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వ్యవసాయ శాఖ అధికారులు అందించిన వివరాల ప్రకారం జిల్లాలో 3189.25 ఎకరాల్లో వరిపంట కోత జరగగా 813 ఎకరాల్లో పంట మాత్రమే కుప్పలుగా వేయడం జరిగింది. మిగతా 2376 ఎకరాల్లో కోసిన వరి పంటకు వరుణుడు కుప్పలు వేసుకునే అవకాశం ఇవ్వకపోవడంతో అలాగే పొలాల్లోనే వుండిపోయింది.

అదంతా పంట నష్టం ఖాతాలో జమవుతుందా? కొంత మాత్రమే పంట నష్టంగా పరిగణిస్తారా? అన్న విషయాన్ని పక్కనబెడితే సరిగ్గా అన్నదాత చేతికి అందివచ్చిన పంట నోటికి కాకుండా పోయిందన్నది నిర్వివాదాంశం. వెరసి అన్నదాతకు అనుకోని కష్టాన్ని మిగిల్చాయి జిల్లాలో అడపాదడపా/ ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు. దీంతో తలపట్టుకోవడమే అన్నదాత వంతయ్యింది. విజయనగరం డివిజన్‌తో పోలిస్తే పార్వతీపురం డివిజన్‌లో ఖరీఫ్‌ నాట్లు వేగంగా పడడం ఆ డివిజన్లో వేల ఎకరాల వరి పంట కోత పూర్తయిన విషయం తెలిసిందే. మరో ప్రధాన పంట మొక్కజొన్న విషయానికి వస్తే వాయుగుండం ప్రభావం జిల్లాపై చూపకముందే దాదాపుగా కోతలు పూర్తవడం, సరక్షితంగా వుంచుకోవడం…వెరసి మొక్కజొన్న రైతు సేఫ్‌ జోన్లో వున్నట్లయింది.

పత్తి పంట విషయానికివ వస్తే ఇంకా కోత దశకు రాలేదు గనుక ప్రస్తుతానికి పత్తి రైతుకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని తెలుస్తోంది. విచ్చుకున్న దశలో వుండడం వల్ల వాయుగుండం ప్రభావం నుంచి తప్పించుకున్నట్లయింది. క్యాబేజీ వంటి పంటపై తాజా వర్షాలు ప్రభావం చూపవు అని గట్టిగా చెప్పలేని పరిస్థితి. పువ్వులోకి వర్షం నీరు పోతే ఇంక అది ఎందుకూ కొరగాకుండా పోతుంది.

వర్షపాతం విషయానికి వస్తే శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు జిల్లాలో సగటున 36.6 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా గుర్ల మండలంలో 67.6 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా సీతానగరం మండలంలో 17.1 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. రామభద్రపురం, పాచిపెంట మండలాల్లో మాత్రం 56 మిల్లిమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది. మొత్తం మీద వాయుగుండ ప్రభావం వల్ల కురిసిన వర్షాలు అన్నదాతకు అనుకోని కష్టాన్ని తెచ్చిపెట్టాయని చెప్పక తప్పదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement