అమరావతి, ఆంధ్రప్రభ : ఉద్యోగ, ఉపాధి కల్పనలో భాగంగా తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండు చేస్తూ నిరుద్యోగులు శనివారం విజయవాడలో కదం తొక్కారు. ముఖ్యమంత్రి జగన్ మాట తప్పి మోసం చేశారని విద్యార్ధి సంఘాలు, నిరుద్యోగులు ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు ధర్నాకు తరలివచ్చారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా అన్ని జిల్లాల్లోనూ నిరుద్యోగులు ఈ ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కాగ విజయవాడలో జరిగిన ఆందోళన సందర్భంగా నిరుద్యోగులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం తలెత్తింది. ధర్నా కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు రంగంలో దిగి నియం త్రించేందుకు యత్నించారు. దీంతో నిరుద్యోగుల ఆందోళనలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉద్యోగాలపై హామీలు గుప్పించి ఓట్లు వేయిం చుకున్న జగన్ 2.35 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని డిమాండు చేశారు. ఖాళీ పోస్టులకు తక్షణం నోటిఫికేషన్ విడుదల చేయడంతోపాటు ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.5వేలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండు చేస్తూ ఆందోళన తీవ్రతరం చేస్తామని యువజన సంఘాలు పిలుపునిచ్చాయి.
అదేవిధంగా 25వేల టీచర్ పోస్టుల భర్తీ చేయాలని డిమాండు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కె ప్రసన్నకుమార్, డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యారావు, కార్యదర్శి జి రామన్న మాట్లాడుతూ ఏపీలో 2.35లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉండగా, 66వేల ఖాళీలు మాత్రమే ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం యువతను ద్రోహం చేయడమేనని అన్నారు. ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని కనీసం తెలంగాణా ప్రభుత్వాన్ని చూసైనా జగన్ సర్కార్ సిగ్గు తెచ్చుకోవాలన్నారు. ప్రభుత్వ శాఖల్లో రెండులక్షల 35వేల ఖాళీలు ఉంటే గత ఏడాది జూన్‌లో కేవలం 10,400 పోస్టులకు క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులను మోసం చేశారని అన్నారు. ఇప్పుడు అదే పంధాలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ 62 సంవత్సరాలకు పెంచి మరొకసారి నిరుద్యోగులకు మొండి చేయి చూపించి వారిని ఆత్మహత్యలకు పురికొల్పారన్నారు. వెంటనే ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంపు జీఓను వెనక్కు తీసుకోవాలని, డిఎస్సీ, టెట్, ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులు ఇలా ప్రభుత్వ శాఖల్లోని ఖాళీ పోస్టులు మొత్తం భర్తీ చేయాలని, ఏపీపీఎస్సీపరీక్షలకు ప్రిలిమినరీ, నెగిటివ్ మార్కులు రద్దు చేయాలని, ఇప్పటి వరకు ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లకు పరీక్ష తేదీల టైం టేబుల్ ప్రకటించాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ప్రకటించాలని డిమాండు చేశారు.
యువజన సం ఘాల నేతలు, నిరుద్యోగుల అరెస్ట్..
ధర్నా చౌక్ వద్ద ఆందోళనకు అనుమతి లేదని విద్యార్ధులు, నిరుద్యోగులు, యువజన సంఘాల నేతలను పోలీసులు రంగ ప్రవేశం చేసి అడ్డుకోవడంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ధర్నా చౌక్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులను నియంత్రించే చర్యల కు దిగారు. దీంతో అక్కడికి చేరుకుంటున్న యువతను అడ్డుకుని ఆందోళన కారులతో సహా అరెస్టు చేశారు. మరోవైపు జిల్లాల్లో ఎక్కడికక్కడ విద్యార్ధి, యువజన, నిరుద్యోగ సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టులు, గృహ నిర్భంధాలు చేశారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఆందోళన కారులను అరెస్టు చేసిన పోలీసులు ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నేతలు కె.ప్రసన్నకుమార్, సూర్యారావు, జి రామన్న, ఎం.సోమేశ్వరరావు, పి.కృష్ణ, ఎన్.నాగేశ్వరరావు, రిజ్వాన్, లెనిన్, నిజాం తదితరులను కృష్ణాజిల్లా ఉంగుటూరు, భవానీపురం, సింగ్‌నగర్ పోలీస్టేషన్‌లకు తరలించారు. దీంతో ఆగ్రహించిన ఆందోళనకారులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాడతామన్న విద్యార్ధి సంఘం నాయకులు అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు. శాంతియుతంగా నిరసన తెలియచేస్తుంటే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి లేదు, ఉద్యాగాలు లేవని ధ్వజమెత్తారు.
నిరుద్యోగుల అరెస్టులు అక్రమం : వామపక్షాలు..
కాగా.. ఉద్యోగాల కోసం విద్యార్ధులు, నిరుద్యోగులు, యువజన సంఘాల నేతలు రాష్ట్రంలో ముఖ్యంగా విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. శాంతియుతంగా నిరసన తెలియచేసేందుకు పూనుకున్న నిరుద్యోగుల ఆందోళనకు అనుమతి నిరాకరించడమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా నాయకులను ఒకరోజు ముందునుంచే అక్రమ అరెస్టు చేయడం, అదేవిధంగా ధర్నాలో పాల్గొన్న వారిని అరెస్టు చేసి పోలీస్టేషన్లకు తరలించడం జగన్ ప్రభుత్వ నిరంకుశ విధానానికి నిదర్శనమన్నారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని సిపి ఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండు చేశారు. ఇకనైనా సీఎం జగన్ తన వైఖరి మార్చుకోకుంటే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..