హైదరాబాద్, ఆంధ్రప్రభ: సీఎం కేసీఆర్ ప్రకటించిన జాతీయ పార్టీ సన్నాహాలు వేగం పుంజుకున్నాయి. పార్టీ వ్యవస్థాపనతోపాటు జాతీయ స్థాయిలో విస్తరణకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుని బలోపేతం చేసుకునే ముందస్తు వ్యూహంతో సీఎం కేసీఆర్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాజీ ఎంపీ, ఏపీ నేత ఉండవల్లి అరుణ్‌కుమార్ భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వీరి కలయిక రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. త్వరలో సీఎం కేసీఆర్ స్థాపించనున్న జాతీయపార్టీకి ఏపీ ఇన్‌చార్జిగా ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. మొదటినుంచీ బ్రాహ్మణ వర్గానికి చెందిన పండితులు, నేతలను గౌరవించే సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా ఉండవల్లిని పిలిపించుకుని జాతీయ పార్టీ విషయంలో అడుగులు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, కాంగ్రెస్ ఫ్రంట్‌తోపాటు, మమతా బెనర్జీ ప్రతిపాదిస్తున్న ప్రత్యామ్నాయ ఫ్రంటల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌తో ఉండవల్లి భేటీ తీవ్ర ప్రాధాన్యత సంతరించుకున్నది. భవిష్యత్‌లో ఏపీ సీఎం జగన్‌తో కలిసి జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయాల్సి వస్తే ఉండవల్లి కీలకంగా మారుతారని ఆయన భావిస్తున్నట్లుగా రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో ఢిల్లిలో కీలకంగా పనిచేసిన ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు ఢిల్లిలో రాజకీయ, అధికారిక వర్గాల్లో మంచి పరిచయాలు ఉన్నాయి. జాతీయ రాజకీయాల్లో ఇది కలిసివచ్చే అంశంగా సీఎం కేసీఆర్ చర్చించినట్లు తెలిసింది. ఏపీనుంచి ఎంపీగా ఉమ్మడి రాష్ఠ్రంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఉండవల్లి రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కీలకంగా పనిచేశారు. స్వతహాగా అడ్వొకేట్ అయిన ఆయన ఉమ్మడి రాష్ట్ర కొనసాగింపును బలంగా వినిపించారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన అనంతరం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.
తాజాగా జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టిన సీఎం కేసీఆర్ ఉండవల్లితో భేటీ కావడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఆదివారం సెలవురోజున జరిగిన ఈ భేటీతో రాజకీయాలు వేడెక్కాయి. రెండు తెలుగు రాష్ట్ర్రాల్లో ఈ ఉదంతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొత్త రాజకీయా పార్టీ ఏర్పాటు దిశగా కార్యాచరణ చేస్తున్న సీఎం కేసీఆర్ పలు వర్గాలతో భేటీ అవుతున్న సంగతి తెలిసిందే. భారత్ రాష్ట్రీయ సమితి పేరుతో జాతీయ పార్టీ స్థాపన దిశగా మొగ్గుచూపుతున్న ఆయన పార్టీ పటిష్టతకు కూడా ముందుస్తుగానే ప్రణాళికాబద్దంగా ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలో త్వరలోనే ఈ పేరుతోనే పార్టీని రిజిస్ట్రేషన్ చేయించనున్నారని సమాచారం. నూతన పార్టీని ఢిల్లి వేదికగా ప్రకటించేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నెలాఖరులో ఈ మేరకు కొత్త పార్టీ ప్రకటించడంతోపాటు ఢిల్లిలో ముమ్మర భేటీలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు కారు గుర్తును కావాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరాలని నిర్ణయించినట్లు తెలిసింది.
తద్వారా దేశంలో కొత్త జాతీయ ప్రత్యామ్నాయ శక్తిని దేశ ప్రజలకు అందుబాటులోకి తేవాలని, అనంతర పరిస్థితులను తనకు వీలుగా మలచుకోవాలని ఆయన మేధోమథనం చేస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికలు, శాసనసభా వర్షాకాల సమావేశాలు, తాజా రాజకీయ పరిణామాలపై శుక్రవారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించిన సంగతి తెలిసింది. ఈ నెల 19న జరగనున్న టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు ఇప్పటికే టీఆర్‌ఎస్ బాస్ నిర్ణయించారు. ఇదే అంశంపై మంత్రులు, తన తనయుడు కేటీఆర్ కూడా ఏకీభవించడంతో సీఎంగా ఉంటూనే దేశరాజకీయాలవైపు దృస్టిసారించనున్నారు. ఇకమీదట ఢిల్లి తరహాలో హైదరాబాద్‌ను జాతీయ రాజకీయ వేదికగా మార్చేందుకు ఉన్న అన్ని అవకాశాలను సీఎం కేసీఆర్ అధ్యయనం చేస్తున్నారు.