Friday, November 22, 2024

Big Story | ఏపీ ”ఎర్ర” వ్యూహం పై కుదరని ఏకాభిప్రాయం.. నివేదిక కోసం మూడు నెలల గడువు 

తిరుపతి, (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో) : దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పట్టుబడిన ఎర్ర చందనం దుంగల వేలం ద్వారా మరింత ఆదాయం పెంచుకోవాలనుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆలోచనకు బ్రేక్ పడింది. తిరుపతి వేదికగా రెండురోజుల క్రితం ఎర్ర చందనం విక్రయాలపై జరిగిన జాతీయ స్థాయి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఆలోచన అమలుకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఇతర రాష్ట్రాల మద్దతుతో తమ ఆలోచన విషయంలో నిపుణులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడంలో మాత్రం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం సఫలమైంది. ఈ పరిస్థితుల్లో ఆ కమిటీ మూడు నెలలపాటు అధ్యయనం చేసి సమర్పించే నివేదిక కీలకం కానున్నది. అంతర్జాతీయ మార్కెట్ లో సిరులు కురిపించే ఎర్రచందనం దేశం మొత్తం మీద అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాయలసీమ, నెల్లూరు ప్రాంతాలకు విస్తరించి ఉన్న శేషాచల అటవీ ప్రాంతంలోనే లభించే విషయం అందరికీ తెలిసిందే.

ఆ ఎర్ర చందనాన్ని దుంగల రూపంలో జపాన్, చైనా, మలేసియా వంటి దేశాలకు అక్రమంగా రవాణా చేస్తున్న వారిని పట్టుకోడానికి తిరుపతి కేంద్రంగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కూడా పనిచేస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. కాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత దశాబ్దానికి పైగా పట్టుబడిన ఎర్ర చందనం దుంగలను వేలం వేసి ఆదాయం పెంచుకునే ప్రయత్నాల్ని ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ అనుమతితో గత పదేళ్లలో రెండుసార్లు వేలం వేయగా ఒకసారి రూ.505 కోట్లు, రెండవ సారి రూ. 1,660 కోట్ల చొప్పున ఆదాయం లభించింది. తాజాగా గత ఏడాది డిసెంబర్ లో మరోసారి వేలం వేయడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో నిర్వహించిన దాడుల్లో పట్టుబడిన 5వేల టన్నుల దుంగలు తిరుపతిలోని గోడౌన్ లో ఉన్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్రం నుంచి విదేశాలకు అక్రమంగా తరలించిండానికి యత్నించి వివిధ రాష్ట్రాల అటవీ, పోలీసు, కేంద్ర రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం దాడుల్లో పట్టుబడి, ఆయా ప్రాంతాల్లో దాదాపు 8వేల టన్నులు ఆయా రాష్ట్రాల అధీనంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో పట్టుబడిన ఎర్రచందనం దుంగలన్నీ రాష్ట్రానికి చెందినవే కనుక ఆ దుంగలను కూడా రాష్ట్రానికి తీసుకువచ్చి వేలం వేసే అధికారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

ఈ లక్ష్యంతోనే ఈనెల 14వ తేదీన తిరుపతి కేంద్రంగా కేంద్ర అటవీశాఖ నేతృత్వంలో దేశంలోని వివిధ రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశం ఏర్పాటు చేసింది. కేంద్ర అటవీ శాఖ తరపున డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ స్పెషల్ సెక్రటరీ చంద్ర ప్రకాష్ గోయల్ హాజరు కాగా.. కేంద్ర రెవెన్యూ ఇంటెలీజెన్స్ విభాగం అధికారులు, దేశంలోని వివిధ రాష్ట్రాల అటవీ శాఖల ముఖ్య అటవీ సంరక్షణాధికారులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ అధికారులు వివిధ రాష్ట్రాల్లో పట్టుబడి ఉన్న ఎర్ర చందనం దుంగలను తమకు ఇవ్వాలని, వాటిని కూడా వేలం వేసి వచ్చే ఆదాయంలో యాభై శాతం ఆ దుంగలను పట్టుకున్న రాష్ట్రాలకు, కేంద్ర విభాగాలకు ఇస్తామని, ఈ వ్యవహారంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఒక నోడల్ ఏజెన్సీ గా వ్యహరించడానికి అనుమతి ఇవ్వాలని ప్రతిపాదించింది. దాదాపుగా అన్ని రాష్ట్రాల అధికారులు ఆ ప్రతిపాదనకు అంగీకారం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అధికారులు మాత్రం తమ ప్రభుత్వంతో చర్చించి తమ నిర్ణయం తెలియచేస్తామన్నారు. కానీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తరువాత ఎక్కువ నిల్వలు ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల అధికారులు ఆ ప్రతిపాదనకు అంగీకరించలేదు.

- Advertisement -

తమ రాష్ట్రంలో పట్టుబడిన దుంగలను తామే వేలం వేసుకోడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ అంశంపై తర్జన భర్జన జరిగింది. ఒక దశలో ఆయా రాష్ట్రాల దాడుల్లో పట్టుబడిన ఏనుగు దంతాలు, పులి చర్మాలు వంటి వాటిని కేంద్ర వన్యమృగ సంరక్షణ చట్టాల ప్రకారం తగులబెట్టినట్టు, దుంగలను కూడా తగులబెడ్తే పోతుందని ఒడిస్సా కు చెందిన అధికారులు సూచించారు. వృక్షాల విషయంలో ఆ చట్టాలు వర్తించవని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉన్నతాధికారి నీరభ్ కుమార్ వివరణాత్మకంగా తెలియచేసారు. అంతే కాక అంతర్జాతీయ మార్కెట్ ఆకట్టుకునే విధంగా దుంగలను గ్రేడింగ్ చేసి భారీ గోడౌన్ ను తిరుపతిలో నిర్మించి ఉన్నామని, ఇతర రాష్ట్రాలలో అటువంటి వ్యవస్థ లేదని, పైగా వివిధ దేశాల నుంచి వ్యాపారులను ఆహ్వానించి  రెండుసార్లు వేలం వేసిన అనుభవం తమకు ఉందని కూడా ఆయన వాదించారు.

తుది నిర్ణయం రాని దశలో ఛత్తీస్ గడ్ రాష్ట్ర ఉన్నతాధికారి ఈ అంశంపై నిపుణులు, ఉన్నతాధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా అధ్యయనం చేయాలని చేసిన సూచనకు అందరూ ఆమోదం తెలిపారు. ఆ కమిటీ తన నివేదికను మరో మూడు నెలల్లోనే ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా సమావేశంలో తీర్మానం చేశారు. మొత్తంమీద దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ఉన్న ఎర్ర చందనం దుంగలను రాష్ట్రానికి తెప్పించి వేలం వేయడం ద్వారా తమ ఆదాయాన్ని పెంచుకోవాలన్న ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రయత్నం ఎంతమేరకు ఫలిస్తుందనే విషయం తేలాలంటే మరో మూడు నెలలు వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement