Saturday, November 23, 2024

Breaking: ఉక్రెయిన్ పరిస్థితిపై తెలుగు విద్యార్థుల ఆవేదన.. ఢిల్లీ చేరుకున్న స్టూడెంట్స్​కి ఏపీ భవన్లో వసతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : యుద్ధభూమి ఉక్రెయిన్ పరిస్థితిని చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని ఆ దేశం నుంచి తిరిగొచ్చిన తెలుగు విద్యార్థులు చెబుతున్నారు. యుద్ధ ప్రభావం పెద్దగా లేని పశ్చిమ ఉక్రెయిన్ ప్రాంతం నుంచి రొమేనియా, హంగేరి దేశాల మీదుగా భారత్ చేరుకున్నవారిలో తెలుగు విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ భవన్ అధికారులు గుర్తించి, వారికి భోజన, వసతి, ప్రయాణ సదుపాయాలు కల్పించారు. ఆదివారం ఢిల్లీ చేరుకున్న 3 విమానాల్లో మొత్తం 17 మంది విద్యార్థులను ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారిగా గుర్తించారు. బుకారెస్ట్ (రొమేనియా) నుంచి ఆదివారం తెల్లవారుఝూమున ఢిల్లీ చేరుకున్న తొలి విమానంలో తెలుగు విద్యార్థులకు ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ స్వయంగా స్వాగతం పలికారు.

విద్యార్థులను ఏపీ భవన్‌కు తరలించి వారి వారి స్వస్థలాకు సమీపంలో ఉండే విమానాశ్రయాలకు టికెట్లను బుక్ చేశారు. అనంతపురం, కడప జిల్లాలకు చెందిన ముగ్గురు విద్యార్థులకు బెంగళూరు విమానంలో టికెట్లు బుక్ చేయగా, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన విద్యార్థులకు విశాఖపట్నం విమానంలో టికెట్లు బుక్ చేశారు. మిగతా విద్యార్థులను విజయవాడకు తరలించాల్సి ఉండగా, నేరుగా అక్కడికి వెళ్లే విమానం అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్ మీదుగా విజయవాడ తరలించేలా ఏర్పాట్లు చేశారు. తెలంగాణ భవన్ సిబ్బందితో కలిసి పరస్పరం సహకరించుకుంటూ, సమన్వయంతో రెండు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను గుర్తించి, వారి వారి స్వస్థలాలకు చేర్చేందుకు కృషి చేస్తున్నామని ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు.

ఈ సందర్భంగా భారత్ చేరుకున్న తెలుగు విద్యార్థులు మీడియాతో మాట్లాడారు. తాము ఇన్నాళ్లుగా చదువుకున్న దేశంలో నెలకొన్న పరిస్థితులను ఆవేదన కల్గిస్తున్నాయని అన్నారు. తిరిగొచ్చినవారిలో 6వ సంవత్సరం విద్యను పూర్తిచేసుకున్నవారి నుంచి తొలి ఏడాది వైద్య విద్య అభ్యసిస్తున్నవారి వరకు ఉన్నారు. ఉక్రెయిన్ ప్రజలు భారతీయుల పట్ల మర్యాదగా, ఆప్యాయంగా ఉంటారని, అలాంటి ప్రజలు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులు చూస్తుంటే బాధగా ఉందని విద్యార్థులు వ్యాఖ్యానిస్తున్నారు. భారతదేశం విదేశాంగ వైఖరిలో భాగంగా రష్యాకు అనుకూలంగా ఉన్నప్పటికీ, ఉక్రెయిన్ ప్రజలు మాత్రం భారతీయుల పట్ల ఎలాంటి కోపం, ద్వేషం ప్రదర్శించరని చెబుతున్నారు. శని, ఆదివారాల్లో భారత్ చేరుకున్నవారిలో చాలా వరకు యుద్ధ ప్రభావం అంతగా లేని పశ్చిమ ప్రాంతాల నుంచే తిరిగొచ్చినట్టు చెప్పారు. యుద్ధ ప్రభావం లేకపోయినా, యుద్ధం కారణంగా ఏటీఎంలు ఖాళీ అయిపోవడం వల్ల కొంత ఇబ్బందిపడ్డామని, అయితే ఇండియన్ ఎంబసీ తమను రొమేనియా, హంగేరి సరిహద్దులకు బస్సుల్లో తరలించిందని, అక్కణ్ణుంచి ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల సిబ్బంది తమను బుకారెస్ట్, బుడాపెస్ట్ నగరాలకు తరలించి ప్రత్యేక విమానాల్లో భారత్ పంపించారని చెప్పారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ కోసం చాలా ఏర్పాట్లు చేశాయని హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement