న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆన్‌లైన్ లాటరీ పేరుతో లక్షల్లో మోసగించిన ఓ ఉగాండా జాతీయుడిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుణ్ణి పట్టుకోడానికి పోలీసులు సినీ ఫక్కీలో గ్యాస్ కట్టర్లను ఉపయోగించి గేటు తొలగించాల్సి వచ్చింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా నగరి మండలం నంబాకం గ్రామానికి చెందిన యువతికి రూ. 2.5 కోట్లు విలువ చేసే ఆన్‌లైన్ లాటరీ వచ్చిందని ఉగాండా జాతీయుడు నెల్సన్ హోగ్లర్ అలియాస్ జాన్ నమ్మించాడు. ఆ లాటరీ సొమ్ము విడుదల చేయాలంటే డబ్బు కట్టాల్సి ఉందంటూ పలు దఫాలుగా ఏకంగా రూ. 13.78 లక్షల మేర వసూలు చేశాడు.
అతనికి డబ్బు కట్టడం కోసం ఒంటి మీద బంగారం, ఇల్లు, పొలం తాకట్టు పెట్టి మరీ ఆ యువతి డబ్బు అందజేసింది. చివరకు తాను మోసపోయానని గ్రహించాక ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. రాష్ట్రంలో కలకలం సృష్టించిన ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిత్తూరు ఎస్పీ సునీల్ కుమార్ స్వయంగా రంగంలోకి దిగి పుత్తూరు డీఎస్పీ యశ్వంత్ నేతృత్వంలో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నెల్సన్ ఢిల్లీలో ఉండి ఈ మోసాలకు పాల్పడుతున్నట్టు తెలుసుకున్నారు. నగిరి ఇన్స్పెక్టర్ మద్దయ్యచారి నేతృత్వంలో బృందం ఢిల్లీ చేరుకుని, స్థానిక పోలీసుల సహాయంతో నిందితుడి నివాసంపై దాడి చేసింది.
అయితే పోలీసులు వచ్చిన విషయం తెలుసుకున్న నిందితుడు నెల్సన్ ఇంటి గేటును ఎంతకీ తెరవలేదు. దీంతో పోలీసులు ఆ గేటును తెరిచేందుకు గ్యాస్ కట్టర్లను ఉపయోగించాల్సి వచ్చింది. ఎట్టకేలకు నెల్సన్‌ను అరెస్టు చేసిన పోలీసులు ఢిల్లీ నుండి చిత్తూరుకు తీసుకెళ్లేందుకు స్థానిక కోర్టులో ట్రాన్సిట్ వారంట్ తీసుకున్నారు. ఇదే తరహాలో చాలామందిని మోసగించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అన్ని కోణాల్లో తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..