శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. ఏప్రిల్ 6 నుంచి 10వ తేదీ వరకు శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు ఆలయా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో నేటి నుంచి ఆలయంలో స్వామివారి గర్భాలయ సామూహిక అభిషేకాలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజలు కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
దాంతో పాటు ఏప్రిల్ 6 నుంచి 10వ తేదీ వరకు శ్రీశైలం ఆలయంలో స్వామివారి స్పర్శ దర్శనాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా దేవస్థానం రద్దు చేసింది. భక్తులందరినీ అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తారు.
కాగా, ఏప్రిల్ 5 వరకు భక్తుల రద్దీకి అనుగుణంగా దేవస్థానం స్వామివారి దర్శన వేళల్లో మార్పులు చేసింది. స్వామివారి వీఐపీ బ్రేక్ దర్శనాలకు, స్వామివారి గర్భగుడి స్పర్శ దర్శనాలకు భక్తులను విదతలవారీగా అనుమతించనున్నారు. రోజుకు నాలుగు విడతలుగా ఏప్రిల్ 5 వరకు అనుమతి లభిస్తుంది.