శ్రీశైలం శ్రీభ్రమరాంబమల్లికార్జున స్వామి దేవాలయంలో ఉగాది మహోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. రెండోరోజు ఆదివారం మహాదుర్గ అలంకారంలో శ్రీశైల భ్రమరాంబికాదేవి అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈ సాయంత్రం కైలాసవాహంపై స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీశైలం పురవీధులలో ఆది దంపతులకు గ్రామోత్సవం కార్యక్రమం నిర్వహిస్తారు.
ఈ నేపథ్యంలో శ్రీశైలం ఆలయానికి భారీగా భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసాయి. స్వామివారి దర్శనానికి సుమారు 7 గంటల సమయం పడుతోంది. శాస్త్రోక్తంగా యాగశాలలో అర్చకులు, వేదపండితులు, ఈవో పెద్దిరాజు కలిసి ఉగాది మహోత్సవాల ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది మహోత్సవాల నేపథ్యంలో ఆలయానికి భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. దీంతో స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనాలను అధికారులు నిలిపివేశారు.
భక్తుల రద్దీకి అనుగుణంగా అందరికి స్వామివారి దర్శనం కల్పించేందుకు భక్తులందరికి అలంకార దర్శనానికి అనుమతిస్తున్నామని ఈవో పెద్దిరాజు తెలిపారు. ఈరోజు నుంచి ఈనెల 10 వరకు శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. మొదటిరోజు శ్రీశైలం భ్రమరాంబాదేవి అమ్మవారికి మహాలక్ష్మి అలంకార రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్లకు బృంగి వాహనసేవ నిర్వహించారు.