అమరావతి, ఆంధ్రప్రభ : ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ తీవ్ర ఉత్కంఠతను రేపుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ సమయం ఉండగానే రాష్ట్ర రాజకీయాలు వేడేక్కాయి. రాజకీయ పార్టీలు పొత్తుల .. ఎత్తులు మొదలు పెట్టాయి. ఎవరి ఉహాలకు , అంచనాలకు అందని విధంగా వ్యూహరచన చేస్తూ ఎన్నికల సంగ్రామానికి సిద్దమవుతున్నాయి. ఈ ఎత్తులు రాజకీయ విశ్లేషకులకు కూడా ఏ మాత్రం అర్ధంగాని పరిస్ధితి ఉందని చెప్పవచ్చు. అధికార పార్టీ తాము అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలే తిరిగి ఈ అధికారాన్ని అందిస్తుందన్న భరోసాతో ఒంటరిగానే బరిలోకి దిగాలని భావిస్తుంటే, ప్రతిపక్ష పార్టీలైన జనసేన, తెదేపా ఎలాగైనా వైకాపాను ఓడించి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఒకవైపు ముందస్తు ఎన్నికల ఉహాగానాలు బలంగా వినిపిస్తున్న క్రమంలో తెదేపా , జనసేన కార్యాచరణను ఇప్పటికే ప్రారంభించాయి. దీంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ దాదాపుగా మొదలైనట్టు స్పష్టంగా కనిపిస్తోంది. 2024 ఎన్నికలలో పొత్తులే కీలకమన్నా వాదన బలంగా వినిపిస్తుండటంతో రాజకీయ పార్టీలు దీనికి సంబంధించిన కసరత్తును మొదలు పెట్టి దూకుడు పెంచాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకఅడుగు ముందుకు వేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదని స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా కీలకమైన ప్రకటనను తాజాగా చేశారు. అవసరమైతే ఒక మెట్టు దిగేందుకు తాను సిద్దమని ప్రకటించారు. అధికార పార్టీని గద్దె దింపడమే తన లక్ష్యమని తేల్చి చెప్పారు. ఆనాటి నుంచి ఏపి రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. 2014 ఎన్నికలలో తెలుగుదేశం బీజేపీ , జనసేన సంయుక్తంగా పోటీ చేసి అఖండ విజయాన్ని సాధించాయి. ఆనాడు జనసేన బరిలోకి దిగకుండా తెదేపా , బీజేపీ సంపూర్ణ మద్దతును ఇచ్చింది.
అయితే ఆతర్వాత పరిణామాలలో తెదేపా , బీజేపీల మధ్య దూరం పెరిగింది. ఢిల్లి గద్దెను ఢీ కొట్టేందుకు ప్రయత్నించిన తెదేపా అధినేత చంద్రబాబు 2019 ఎన్నికలలో ఘోర పరాజయాన్ని చవిచూసి అధికారాన్ని కోల్పోయారు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ అనేక సంక్షోభాలను చవిచూసింది. అధికార వైసీపీ అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించి ప్రజలకు చేరువ అయ్యింది. మూడేళ్ళ పాలన సజావుగా సాగినా ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో కాస్త మార్పులు చోటుచేసుకున్నాయి. రాజకీయ విశ్లేషకుల సైతం ఇదే విషయాన్ని పదే పదే స్పష్టం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు లేకుండా చవిచూసిన ఓటమి నుంచి కొంత గుణపాఠం నేర్చుకున్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తి చేస్తున్నారు. మహానాడు గ్రాండ్ సక్సెస్ తో తెలుగుదేశం పార్టీ మంచి జోరుమీద ఉంది. ఈ సందర్భంగా చంద్రబాబు వార్ వన్ సైడేనని కీలక కామెంట్స్ చేశారు. దీనికి ముందు చంద్రబాబు జిల్లాల పర్యటనలో పలు ప్రాంతాల్లో నేతలు , కార్యకర్తలు , అభిమానులు జనసేనతో పొత్తుపెట్టుకుని ముందుకు సాగాలన్న విజ్ఞప్తులను అధినేతకు చేశారు. అయితే చంద్రబాబు దీనిపై నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశారు. పొత్తులకు ఇంకా సమయం ఉందంటూనే చెబుతూ మరోవైపు వన్ సైడ్ లవ్ ఎలా అని అన్నారు. అవతల వాళ్ళు కూడా కలిసి పని చేయాలి కదా అన్నట్టు సంకేతాలు ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలుగు తమ్ముళ్ళలో కాస్త కలవరానికి గురిచేశాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం చేసిన కీలక వ్యాఖ్యలపై తెదేపా నేతలు, కార్యకర్తల్లో విస్త్రృతమైన , ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. గతంలో తాను తగ్గామని ఇప్పుడు ఏ మాత్రం తగ్గేదే లేదని జనసేనాని స్పష్టం చేయడంతో పాటు పార్టీ నేతలకు కూడా ఒక క్లారిటీని ఇచ్చారు. ఎన్నికలలో పోటీకి ఉన్న అవకాశాలను కుండ బద్దలు కొట్టినట్టుగా స్పష్టం చేశారు.
బీజేపీతో కలిసి బరిలోకి దిగటం లేదా తెదేపా, బిజెపి కలిసి ముందుకు సాగటం ఈ రెండూ కాదనుకుంటే ఒంటరిగా సమరానికి సిద్దం కావాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తెలుగు తమ్ముళ్ళల్లో ఉత్కంఠతకు గురిచేస్తున్నాయి. గత ఎన్నికలలో జనసేన ప్రభావంతో కోల్పోయిన సీట్లు ఇతర అంశాలపై అంతర్మదనం చెందుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు మళ్ళీ చీలితే ఆ ప్రభావం తమ పార్టీపై బలంగా చూపుతుందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో అధిష్టానం ఎలా వ్యవహరిస్తుందో భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అన్న అంశాలతో తెలుగుతమ్ముళ్ళు తమలో తాము చర్చించుకుంటున్నారు. మరో వైపు బీజేపీ రాష్ట్ర నేతలు వారసత్వ రాజకీయాలకు చెక్ పెట్టాలని పదే పదే వ్యాఖ్యనిస్తూ ఉత్కంఠం కూడా కొంత ఆందోళనకు గురిచేస్తోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు తెదేపా అధినేత చంద్రబాబు వైకాపాను గద్దె దించేందుకు దేనికైనా సిద్దమని ఎటువంటి త్యాగానికైనా రెడీ అని చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఆ త్యాగాలు ఎటువంటివో తమకు తెలుసుని తీవ్ర స్దాయిలో విరుచుపడుతూ ఆ త్యాగాలు తమకు అవసరం లేదని , తేల్చి చెప్పారు. అయితే రాష్ట్ర బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను మాత్రం తెదేపా జనసేనలు పెద్దగా పట్టించుకున్న పరిస్దితి లేదు. ఢిల్లి న్యాయకత్వమే పోత్తులపై నిర్ణయం తీసుకుంటుందని విశ్వాసాన్ని తెదేపా సీనియర్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఒంటరిగా బరిలోకి దిగిన అధికారాన్ని ఖచ్చితంగా కైవసం చేసుకుంటామన్న ధీమాని వ్యక్తం చేస్తున్నారు.