అమరావతి, ఆంధ్రప్రభ : రోజురోజుకు పేరుకుపోతున్న చెత్త నగరాలు, పట్టణాలనే కాదు.. పచ్చని పల్లెలకూ సవాల్ విసురుతోంది. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల (యూఎల్బీ) నుంచి రోజుకు 4,200 మెట్రిక్ టన్నుల చెత్త వస్తున్నట్టు తేలింది. ఈ చెత్త సమస్య పరిష్కారానికి ఉన్న వాటిలో ఉత్తమ మార్గం.. దాన్ని మండించి విద్యుత్ ఉత్పత్తి చేయడమే. ఈ ప్రక్రియ మన దేశంలో 1987లో ఢిల్లీలో మొదలైంది. అక్కడే మొదటి ప్లాంటును ఏర్పాటు చేశారు. ఇలా మున్సిపల్ వ్యర్థాలతో నడిచే విద్యుత్ ప్లాంట్లు ఢిల్లీ, జబల్పూర్, హైదరాబాద్‌లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. మన రాష్ట్రంలో రెండు ఉన్నాయి. గుంటూరు, విశాఖపట్నం నగరాలకు సమీపంలో ఒక్కోటి గంటకు 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే వేస్ట్ టు- ఎనర్జీ ప్లాంట్లు- రెండింటిని రూ.640 కోట్లతో జిందాల్ సంస్థ నిర్మించింది.
మన రాష్ట్రంలో రెండు యూనిట్లు
చెత్తే ఇంధనంగా విద్యుత్ ఉత్పత్తి చేసేలా పెల్నాడు జిల్లా కొండవీడులో ఏర్పాటు చేసిన పవర్ ప్లాంటుకు విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు సమీపంలోని మరో 9 మున్సిపాలిటీల నుంచి ఘన వ్యర్థాలను తరలిస్తున్నారు. అలాగే విశాఖ సమీపంలోని కాపులుప్పాడ వద్ద ఏర్పాటు చేసిన ప్లాంటుకు గ్రేటర్ విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం పట్టణాల చెత్తను తరలిస్తున్నారు. ఇక్కడ గార్బేజ్ పిట్స్‌లో వారం రోజులు ఆరబెట్టి, వాటి నుంచి విడుదలయ్యే మీథేన్, ఇతర వాయువులను ఫ్యాన్ల ద్వారా బర్నింగ్ చాంబర్‌కు అనుసంధానించారు. గార్బేజ్ పిట్లో చెత్తను క్రేన్లతో బరిర్నగ్ చాంబర్లో వేసి ఈ గ్యాస్‌తో మండించి వెయ్యి డిగ్రీల వేడిని ఉత్పత్తి చేస్తున్నారు. దీనితో నీటిని ఆవిరిగా మార్చి టర్బయిన్లు తిప్పి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ప్లాంట్స్ ఒక్కోదానిలో రోజుకు 1,200 టన్నుల చెత్తను మండిస్తారు. 15 మెగావాట్ల చొప్పున 30 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ప్లాంట్ అవసరాలకు పోను 13.5 మెగావాట్ల చొప్పున 27 మెగావాట్లను గుంటూరు జిల్లా వెంగళాయపాలెం సబ్ స్టేషన్‌కు, విశాఖలోని విద్యుత్‌ను ఆనందపురం సబ్ స్టేషన్కుసరఫరా చేస్తున్నారు.
మరింత చెత్త తరలిస్తే ..
పట్టణ ఘన వ్యర్థాల్లో ఈ రెండు ప్లాంట్లకు చేరుతోంది 1,800 నుంచి 1,900 టన్నులు. మిగిలిన చెత్తను సాధ్యమైనంత మేర తరలిస్తే మరింత విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. సమర్థంగా ఉప వ్యర్థాల వినియోగం కుళ్లిన చెత్త నుంచి ప్రధానంగా బయో గ్యాస్, లీచెట్ విడుదలవుతాయి. వీటిని జిందాల్ ప్లాంట్లలో సమర్థవంతంగా శుద్ధి చేసి వినియోగిస్తున్నారు. రోజూ 1,200 టన్నుల వ్యర్థాల నుంచి 100 కిలో లీటర్ల (1కిలో లీటర్ అంటే 1000 లీటర్లు) లీచెట్ వస్తోంది. లీటర్ లీచెట్‌లో 70 వేల నుంచి లక్ష మిల్లీగ్రాముల కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (సీఓడీ)తో పాటు ఇతర ప్రమాదకర రసాయనాలుంటాయి. దీన్ని భూమిలోకి ఇంకకుండా పిట్ అడుగునున్న చాంబర్ల ద్వారా సేకరించి శుద్ధి చేయగా 60 కిలో లీటర్ల శుద్ధి జలాలు, 35 కిలో లీటర్ల రిజెక్ట్ వాటర్‌తో పాటు 5 కిలో లీటర్ల స్లెడ్జ్ ఉత్పత్తి అవుతోంది. శుద్ధి జలాలను మొక్కలకు, రిజెక్ట్ వాటర్‌ను బూడిదను చల్లబరిచేందుకు, స్లెడు ఎండబెట్టి తిరిగి చెత్త మండించేందుకు వినియోగిస్తున్నారు. అంటే ఘన వ్యర్థాల నుంచి వచ్చే ఉప వ్యర్థాలను సైతం నూరు శాతం తిరిగి వినియోగిస్తున్నారు. ప్లాంట్లలో జరిగే కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు కాలుష్య నియంత్రణ మండలితో అనుసంధానించారు. కాలుష్య రహితంగా ప్లాంట్ నిర్వహణ దేశంలో ఉన్న ఐదు ప్లాంట్లలో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన రెండూ మన రాష్ట్రంలోనే ఉన్నాయి. జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లలో రోజుకు వందల టన్నుల చెత్తను మండించినా కాలుష్యం ప్లాంట్ దాటి వెళ్లే పరిస్థితి లేదు. థర్మల్ విద్యుత్ ప్లాంట్ విడుదల చేసే కాలుష్యంలో 10 శాతానికంటే తక్కువ కారకాలు విడుదలవుతుం డగా, వాటిని గాల్లోకి చేరకుండా ఆధునిక -టె-క్నాలజీతో అడ్డుకుంటున్నారు. బాయిలర్ అడుగున పడే బూడిదను, బ్లోయర్ల ద్వారా వచ్చే పోల్యూషన్, లీచెట్ శుద్ధి చేయగా వచ్చిన నీటితో చల్లబరిచి రోడ్లపై గుంతలు పూడ్చడానికి వినియోగిస్తున్నారు. మరోపక్క పోల్యూషన్ ఇటుకల తయారీపై కూడా ప్రయోగాలు చేస్తున్నారు.
రోజుకు ఇంటికి 10 యూనిట్ల విద్యుత్ వినియోగం
రాష్ట్రంలో సగటున ఓ ఇంటికి రోజుకు 10 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తారు. నెలకు 300 యూనిట్లు ఓ ఇంటి నుంచి రోజుకు సగటున వచ్చే చెత్త 2.5 కిలోలని మున్సిపల్ శాఖ లెక్క గట్టింది. నెలకు ఒక్కో ఇంటి నుంచి సుమారు 75 కేజీలు. పల్నాడు జిల్లా కొండవీడు వద్ద. విశాఖపట్నం సమీపంలోని కాపులుప్పాడ వద్ద ఉన్న జిందాల్ ఎకోపోలిస్ ఎనర్జీ ప్లాంట్లు గంటకు 30 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. అంటే దాదాపు 72 వేల ఇళ్లకు ఒక రోజుకు సరిపోయేటంత. విద్యుత్, మనం నిత్యం బయట పడేసే చెత్త ద్వారానే విద్యుత్ తయారై తిరిగి ఇంటికి వెలుగునిస్తుంది.