ఇద్దరు వీఆర్వోలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. లంచగొండి అధికారులపై ఏసీబీ అధికారులు కొరడా జుళిపిస్తున్నారు. బాధితుల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు దాడులు నిర్వహించి నిందితులను పట్టుకుని కేసు నమోదు చేస్తున్నారు. తాజాగా ఈరోజు ఏపీలోని రెండు జిల్లాల్లో లంచం తీసుకుంటున్న ఇద్దరు వీఆర్వోలను ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం వరగాన గ్రామ పంచాయతీ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పట్టా పుస్తకం కోసం బాధితుడి నుంచి రూ.8వేలు లంచం తీసుకున్న మౌలాలి అనే వీఆర్‌వోను పట్టుకున్నారు. అదేవిధంగా అనకాపల్లి జిల్లా ములుగపుడి పంచాయతీ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. పట్టా పాస్ పుస్తకం కోసం వీఆర్‌వో రూ.40వేలు డిమాండ్ చేయగా రూ. 20వేలు తీసుకుంటుండగా అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఇద్దరు వీఆర్ఓలపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ పట్టుబడ్డ వీఆర్వోలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు.