Friday, November 22, 2024

AP: హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఇద్దరు ప్రమాణస్వీకారం..

అమరావతి: ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్‌ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ వారితో ప్రమాణం చేయించారు. ఇప్పటి వరకు వీరిద్దరూ అదనపు న్యాయమూర్తులుగా ఉన్నారు.

వారిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని ఈ నెల 13న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇటీవల ఆమోదముద్ర వేశారు. జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. డిగ్రీ వరకు అక్కడే చదివారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.

2008లో నేరుగా జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ఫ్యామిలీ కోర్టు, ఎస్సీ, ఎస్టీ కోర్టు, సీబీఐ కోర్టు, వ్యాట్‌ ట్రైబ్యునల్‌ ఛైర్మన్, విశాఖపట్నం, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాలకు ప్రధాన న్యాయమూర్తి (పీడీజే)గా పనిచేసిన అనంతరం హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. జస్టిస్‌ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు స్వస్థలం కృష్ణా జిల్లా చల్లపల్లి.

- Advertisement -

1994లో జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికయ్యారు. 2007లో సీనియర్‌ సివిల్‌ జడ్జిగా పదోన్నతి పొందారు. మరోసారి పదోన్నతి పొంది 2016 నుంచి అదనపు జిల్లా జడ్జిగా శ్రీకాకుళం, తిరుపతిలో న్యాయసేవలు అందించారు. గుంటూరు మొదటి అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తుండగా హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement