సంతబొమ్మాళి /నందిగాం (శ్రీకాకుళం జిల్లా), ప్రభ న్యూస్ : జమ్ముకశ్మీర్ దోడా జిల్లాలో మంగళవారం తెల్లవారు జామున ఉగ్రవాదులతో హోరాహోరీ ఎదురుకాల్పుల్లో.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు జవానులు నేల కొరిగారు. ఈ విషాద సమాచారంతో టెక్కలి నియోజకవర్గంలోని రెండు కుగ్రామాలు కుమిలి కుమిలి రోదించాయి.
ఒకరు నందిగం మండలం వల్లభరాయుడిపాలెం గ్రామానికి చెందిన సనపల జగదీశ్వరరావు, సంతబొమ్మాళి మండలం చెట్ల తాండ్ర పంచాయతీకి చెందిన యువజవాన్ డొక్కరి రాజేష్ (25) ఉగ్రదాడిలో వీరమరణం పొందారు. ఈ ఘటనతో రాష్ర్టమంత్రి అచ్చెంనాయుడు దిగ్భాంతిని వ్యక్తం చేశారు.
కశ్మీర్ దోడా జిల్లా ధారి గోటె ఉరర్బాగిలో మంగళవారం తెల్లవారుజామున ఉగ్రదాడిని రాష్ట్రీయ రైఫిల్స్, జమ్ముకశ్మీర్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ భీకరంగా ఎదుర్కొంది. సోమవారం రాత్రి 7.45 గంటల సమయంలో రాష్ట్రీయ రైఫిల్స్, జమ్ముకశ్మీర్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సమయంలో ఉగ్ర ముష్కరులు పారిపోయారు. ఆ తరువాత దొంగ దెబ్బ తీశారు.
అనూహ్యంగా పాకిస్తానీకి అనుబంధ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ (జేఈఎం) షాడో గ్రూప్ ‘కశ్మీర్ టైగర్స్’ కాల్పులకు తెగపడ్డారు… అంతే అధికారి సహా నలుగురు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పాయారు. వీరిలో సిక్కోలు బిడ్డలు జగదీశ్వరరావు, రాజేష్ ఉన్నారు. వీరి మరణ వార్తను ఆర్మీ అధికారులు ఆయా కుటుంబాలకు చేరవేశారు.
గొల్లుమన్న వల్లభరాయుడిపాడు…
ఈ సమాచారంతో ఒక్కసారిగా వల్లభరాయుడి పాడు గొల్లుమంది. జగదీశ్వరరావు గత 22 ఏళ్లుగా ఆర్మీలో పనిచేస్తున్నారు. ఏడాది కిందటే జమ్ములో హవల్దార్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున ఉగ్రవాదులు జరిగిన కాల్పుల్లో జగదీశ్వరరావు మృతి చెందారు. ఈ సమాచారాన్ని ఆర్మీ ఉన్నతాధికారులు కుటుంబ సభ్యులకు అందించారు. జగదీశ్వరరావును భార్య సమత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జగదీశ్వరరావు మరణ వార్త తెలిసి తల్లిదండ్రులు, భార్య గుండెలవిసేలా రోదించారు. జమ్ము నుంచి మృతదేహం రాకకోసం గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు.
తల్లడిల్లిన చెట్ల తాండ్ర…
జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదులు జరిపిన కాల్పులలో చెట్ల తాండ్ర పంచాయతీకి చెందిన డొక్కరి రాజేష్ (25) జవాన్ వీరమరణం పొందారు. అమరుడు రాజేష్ కు తల్లిదండ్రులు పార్వతి, చిట్టివాడు, తమ్ముడు మధుసూదనరావు ఉన్నారు. రాజేష్ మృతితో కుటుంబం, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.