తిరుపతి సిటీ : రాష్ట్రంలోని వనరులను రెండు పార్టీలు దోచేస్తున్నాయని, 60:40 అంటూ అధికార, ప్రతిపక్ష పార్టీలు పంచుకుంటున్నాయని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన విధంగానే నేడు వైసీపీ ప్రభుత్వం అవినీతి రాజకీయాలు చేస్తున్నాయని, వాళ్లకు సహకరించకుంటే వెయ్యి కోట్లు ప్యాకేజీ అంటూ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వ్యతిరేకిస్తే బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. తెలుగుదేశం వాళ్లు వైసీపీ ఏజెంట్లు అంటే వైసీపీ వాళ్ళు టీడీపీ ఏజెంట్లు అంటూ బీజేపీ పై వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయానికి ఎట్టి పరిస్థితుల్లో లొంగే పరిస్థితి లేదని, ఇలాంటి రాజకీయాలకు బీజేపీ చరమగీతం పాడుతుందన్నారు. నియోజకవర్గానికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటున్నారని, కుటుంబ రాజకీయాలను బీజేపీ ప్రోత్సహించదన్నారు. ఉప ఎన్నికల్లో బస్సులు తోలి దొంగఓట్లు వేయించారన్నారు. 10వ తరగతి పాస్ అయిన వారికి సైతం పట్టభద్రుల ఓట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని, నివాస ప్రాంతాల్లో కాలువల కోసం తవ్వేసి మామూళ్ల కోసం ప్రజలను మభ్య పెడుతున్నారని ఆరోపించారు.
ఎమ్మెల్సీ అభ్యర్థిగా దయాకర్ రెడ్డిని కేంద్ర బీజేపీ పార్టీ బీఫార్మ్ ఇచ్చిందన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు జనసేన మద్దతు ఉందన్నారు. వైసీపీ మాట్లాడేవి బంగారు రేకులపై అక్షరాలా అన్నారు. బడ్జెట్ లో నిధులు రాకుంటే ఎందుకు బుగ్గన కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ వద్దనే ఉన్నారని అన్నారు. ఈ బడ్జెట్ లో అత్యధిక నిధులు ఏపీకి కేంద్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు. మోడీతోనే అభివృద్ధి సాగుతుందన్నారు. 60పథకాలు కేంద్ర ప్రభుత్వానివేనన్నారు. తనపై తిరుగుబాటు ప్రారంభమైందని ఛానెల్స్ లో మీరే రాసుకుని మీరే అడుగుతున్నారన్నారు. వాస్తవాలు ఒక్క ముక్క మాత్రం బయటకు ఛానెల్స్ లో రావడం లేదన్నారు. అభివృద్ధిపై డిబేట్ పెట్టండి.. మేము రెడీ అన్నారు. అప్పర్ భద్ర కట్టిన రాయలసీమకు వచ్చే నీళ్లు ఎక్కడ రాకుండా ఆగదన్నారు. రాయలసీమకు వచ్చే నీళ్ల వాటాను కచ్చితంగా వచ్చేలా చేస్తామన్నారు. లక్షల కోట్ల రూపాయలతో రోడ్లు వేసిన ఘనత బీజేపీదేనన్నారు. నడికుడి కాళహస్తి రైల్వే లైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం ఎంతవరకు సబబు..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కేంద్ర నిధులతో మాత్రమేనని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు తమకే ఉందన్నారు. వైసీపీ ని ఓడించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని సోము వీర్రాజు స్పష్టం చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో కేంద్రం జోక్యం ఉండదని, కేంద్రం ఎవరినీ కాపాడే ప్రయత్నం చేయదని స్పష్టం చేశారు.