అమరావతి, ఆంధ్రప్రభ : కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజ్ దిగువున రెండు బ్యారేజ్‌ల నిర్మాణం కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు సిద్ధమయ్యాయి. ప్రకాశం బ్యారేజ్ కు దిగువన 2.70 టీఎంసీల సామర్దంతో 12 కిలోమీటర్ల వద్ద ఒక చోట, 4.70 టీఎంసీల సామర్దంతో 62 కిలోమీటర్ల వద్ద మరో చోట బ్యారేజ్ లు నిర్మించేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ సిద్ధం చేసిన ప్రతిపాదనలకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించటమే కాకుండా మొదటి దశ సర్వే కోసం రూ 204 కోట్ల నిధులను కూడా విడుదల చేసింది. ఈ మేరకు డీపీఆర్ లు రూపొందించే బాధ్యతను హైదరాబాద్‌లోని ఆర్వీ అసోసియేట్‌కు అప్పగించారు. ఆర్వీ అసోసియేట్ మొత్తం రూ.2,565 కోట్ల అంచనా వ్యయంతో రెండు బ్యారేజిలకు సంబంధించి సమగ్రంగా రూపొందించిన డీపీఆర్‌లను జలవనరులశాఖకు అప్పగించింది. డీపీఆర్ లో సముద్ర భూగర్భ సాంకేతిక పరిశోధనకు సంబంధించి నివేదికను కూడా జత చేసినట్టు సమాచారం. ఆర్వీ అసోసియేట్ సమర్పించిన డీపీఆర్‌ను బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి తుదిపరిపాలన ఆమోదం కోసం జలవనరుల శాఖ ప్రభుత్వానికి అందచేసినట్టు సమాచారం. అతి త్వరలోనే రెండు బ్యారేజ్‌ల నిర్మాణంపై ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు తెలిసింది.
గుంటూరు, కృష్ణా జిల్లాల్లో..
ప్రకాశం బ్యారేజి దిగువన 12 కిలోమీటర్ల వద్ద పెనమలూరు మండలం చోడవరం-మంగళగిరి మండలం రామచంద్రాపురం మధ్య నిర్మించనున్నారు. దీని అంచనా వ్యయం రూ 1215 కోట్లు. ప్రకాశం బ్యారేజ్‌కు 62 కిలోమీటర్ల దిగువున మోపిదేవి మండలం బండికోళ్లంక-రేపల్లె మండలం తూర్పుపాలెం మధ్య మరో డ్యాము నిర్మించనున్నారు. ఈ బ్యారేజ్ నిర్మాణ అంచనా వ్యయం రూ.1350 కోట్లు. ఈ రెండు బ్యారేజిల నిర్మాణం పూర్తయితే కేవలం అదనపు సాగునీటి లభ్యత మాత్రమే కాకుండా ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కొత్త రోడ్డు మార్గం ఏర్పడుతుందనీ, వివిధ ప్రాంతాల దూరం కూడా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. వరదల సమయంలో ప్రకాశం బ్యారేజ్ నుంచి నీరు సముద్రంలో కలుస్తున్న సందర్భంలో ఆ ఉధృతికి ఉప్పునీరు కూడా వెనక్కి ఎగదోయటంతో నదీ జలాలు కలుషితమవుతున్నాయి. ప్రకాశం బ్యారేజ్ నుంచి విడుదలయ్యే నీరు హంసలదీవి వద్ద సముద్రంలో కలవటంతో వెనక్కి ఎగదన్నుతున్న ఉప్పునీటి ప్రభావం దివిసీమపై ఎక్కువగా ఉంటోంది. అక్కడి తీర ప్రాంతమంతా ఉప్పునీటి మయంగా మారుతోంది. బ్యారేజిల నిర్మాణంతో ఈ సమస్యను అధిగమించటమే కాకుండా నదీ గర్భంలో ఉప్పునీటి శాతాన్ని తగ్గించవచ్చు. చెక్ డ్యాముల రూపంలో బ్యారేజిలు నిర్మించేలా నిపుణులు ప్రతిపాదనలు చేశారు. దీని వల్ల సముద్రంలోని ఉప్పునీరు కలవకుండా బ్యారేజిలకు పటిష్టమైన అడ్డుగోడలను కూడా నిర్మించనున్నారు. అన్నిటికి మించి ప్రకాశం బ్యారేజికి దిగువన రెండు బ్యారేజిల్లో కలిపి 7.40 టీఎంసీ నీటిని నిల్వ చేసే అవకాశం ఏర్పడటం వల్ల ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని అనేక ప్రాంతాలకు అదనంగా సాగునీరు లభిస్తుంది. ఈ రెండు బ్యారేజిలు మాత్రమే కాకుండా గతంలో ప్రభుత్వ ప్రతిపాదనలో ఉన్న వైకుంఠపురం వద్ద కూడా మరో డ్యాము నిర్మిస్తే సముద్రంలో వృధాగా కలుస్తున్న కృష్ణా నదీ జలాలను సద్వినియోగం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.