Tuesday, October 29, 2024

AP | ఇంకుడు గుంతలో పడి ఇద్దరు మైనర్లు దుర్మరణం..

(బొల్లాపల్లి, ఆంధ్రప్రభ) : పల్నాడు జిల్లా బొల్లాపల్లిలోని ఓ ఇంకుడు గుంతలోపడి ఇద్దరు వలస కూలీలు దుర్మరణం చెందారు. కాలకృత్యాలను తీర్చుకునేందుకు వెళ్లిన ఓ మైనరు బాలిక ఇంకుడు గుంతలో పడిపోగా.. కాపాడే ప్రయత్నంలో మరో బాలిక కూడా ఇంకుడు గుంతలో మునిగి ప్రాణాలు వదిలేసింది. శనివారం జరిగిన ఈ ప్రమాద ఘటనను చూసిన ఓ వృద్ధురాలు అప్రమత్తం చేయగా.. అక్కడికి చేరుకున్న వలస కూలీలు వీరిద్దరినీ రక్షించలేక పోయారు.

పొట్టకూటి కోసం ఒడిశా నుంచి వచ్చిన వలస కూలీలు ఈ దుర్ఘటనతో కన్నీరు మున్నీరయ్యారు. ఈ ప్రమాదంలో ఒడిశాకు చెందిన మన్నంగి ఉమా (16), మొల్లక జున్ని (17) ఏడడుగుల ఇంకుడు గుంతలో పడి ప్రాణాలు వదిలారు. బొల్లాపల్లి గ్రామం నుంచి వెల్లటూరు వైపు వెళ్లే రహదారిలోని సంగినీడు పాలెం పొలాలకు సమీపంలోని అటవీ ప్రాంతం అంచున ఉన్న 80 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఒడిశాకు చెందిన 40 మంది వలస కూలీలు పని చేస్తున్నారు.

గత ఆరు నెలలుగా జామాయిల్, శ్రీగంథం మొక్కలు నాటి, నీరు పట్టి మొక్కలను సంరక్షించే పనులు చేస్తున్నారు. ఈ పొలంలోనే సుమారు మూడు ఎకరాల విస్తీర్ణం లో పట్టాలతో పెద్ద సంపు ఏర్పాటు చేశారు. దాని పక్కనే కూలీలు బట్టలు ఉతుక్కునేందుకు, స్నానాలు కోసం ఇంకుడు గుంతను కూడా ఏర్పాటు చేశారు. సమీపంలోని మూగచింతల పాలెం ఎన్ఎస్పీ డీప్ కట్ నుంచి పైపు లైన్ల ద్వారా నీటిని ఇక్కడకు తరలిస్తున్నారు.

శనివారం ప్రమాదవశాత్తు ఇద్దరు మైనర్లు ఇంకుడు గుంతలో పడి మృతి చెందినట్లు ముందుగా ఓ వృద్ధురాలు సమాచారం ఇవ్వడంతో గుంతలో నుంచి మృతదేహాలను బయటకు తీశారు. రెండు మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బండ్ల మోటు ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు. నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు ఘటన స్థలాన్ని పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement