Saturday, November 23, 2024

హైక్లాస్​ పేరిట నయా దందా.. ఆడి కారులో తిరుగుతూ డ్రగ్స్​ సప్లయ్​.. విశాఖలో దొరికిన గ్యాంగ్​..

వాళ్లంతా హై క్లాస్​ సొసైటీలోని ధనవంతుల బిడ్డలు.. దేనికైనా ఎంతైనా ఖర్చుపెట్టడానికి వెనకా ముందు ఆలోచించరు. తిరగడానికి ఆడి కార్లు, తాగడానికి పబ్​లు.. ఇలా వారి రోజువారీ జీవనం ఎంతో హ్యాపీగా లీడ్​ చేస్తున్నారు.. ఇంతదాకా బాగానే ఉన్నా.. ఇప్పుడు వారు డ్రగ్స్​ ఉచ్చులో చిక్కుకోవడమే ఇష్యూగా మారింది. తాము ఏం చేసినా ఎవరూ అడ్డుచెప్పరన్న ధీమాతో వేర్వేరు ప్రాంతాలకు చెందిన వీరు పబ్​లో ఫ్రెండ్స్​ అయ్యారు. డ్రగ్స్​ డీలింగ్​ చేస్తూ.. టాస్క్​ఫోర్స్​ వలలో చిక్కారు..

డ్రగ్స్‌ తీసుకోవడమే కాక.. విశాఖపట్నానికి సప్లయ్​ చేస్తున్న ఓ మహిళతో సహా ముగ్గురిని అరెస్టు చేశారు టాస్క్​ ఫోర్స్​ పోలీసులు. వారు వాడుతున్న ఆడి కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు స్పెషల్​ బ్రాంచ్​ ఏడీసీపీ ఆనంద్​రెడ్డి.. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. ఆడి కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మగాళ్లు,  ఒక మహిళను అరెస్టు చేసి వారి దగ్గర నుంచి18 MDMA టాబ్లెట్లు,  MD క్రిస్టల్ పౌడర్ కు సంబంధించిన రెండు సాచెట్లను స్వాధీనం చేసుకున్నారు. హెచ్‌ఆర్‌ ప్రొఫెషనల్‌ అయిన ఆ యువతి హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నంకు బస్సులో డ్రగ్స్‌ తీసుకువస్తోంది.

విశాఖ సిటీలోని  NAD జంక్షన్ నుంచి ఆమెను ఇద్దరు స్నేహితులు పిక్​ చేసుకున్నారు.  అందులో ఒక డాక్టర్​ కూడా ఉన్నారు. నిందితులంతా హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో ఒకరికొకరు పరిచయమై ఆ తర్వాత స్నేహితులయ్యారు. హైదరాబాద్‌, బెంగళూరు, గోవా నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేసి విశాఖకు తీసుకొస్తున్నట్టు వారి ద్వారా తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన గీత, మాలవ్య (24), విశాఖపట్నంకు చెందిన హేమంత్ (35), రాజాంకు చెందిన పృథ్వీ (33) స్నేహితులు అని స్పెషల్ బ్రాంచ్ అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏడీసీపీ) ఆనంద్ రెడ్డి తెలిపారు. గతేడాది గోవా పర్యటనలో వీరంతా డ్రగ్స్‌ సేవించారని, అంతేకాకుండా అక్కడే డ్రగ్స్​ అమ్మకానికి ప్లాన్​ చేశారని తెలిపారు.

డ్రగ్స్ కోసం హేమంత్ ఫోన్ పే ద్వారా పృథ్వీకి కొంత అమౌంట్​ పంపాడు. గీత, మాలవ్య మాలవీయ ద్వారా హేమంత్‌కు డ్రగ్స్ పంపించారు..  అని ఆనంద్ రెడ్డి తెలిపారు. హేమంత్ పృథ్వీ నుండి డ్రగ్స్ కోరగా.. అతను తన స్నేహితురాలు మాలవ్యను సంప్రదించి వైజాగ్‌కు డ్రగ్స్ తీసుకురావాలని అభ్యర్థించాడు. హైదరాబాద్‌కు చెందిన గీత ప్రధాన డ్రగ్స్ సరఫరాదారుగా గుర్తించిన పోలీసులు ఆమెను పట్టుకునేందుకు ట్రై చేస్తున్నారు. జనవరి 29న మాలవ్య డ్రగ్స్ తీసుకుని హైదరాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం విశాఖపట్నం చేరుకుంది. దీంతో ఈ ముగ్గురిని అరెస్టు చేశారు. డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు వారు నడుపుతున్న ఆడి కారుని కూడా స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement