తిరుపతి సిటీ, ప్రభ న్యూస్ : తిరుపతి నగరంలో ఏటీఎం సెంటర్ లో ట్యాంపరింగ్ మోసాలకు పాల్పడిన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకటప్ప నాయుడు ఈరోజు తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ వెంకటప్ప నాయుడు మాట్లాడుతూ… నగరంలో పలు ఏటీఎం సెంటర్లలో ట్యాంపరింగ్ మోసాలకు పాల్పడుతూ రూ.6,71,000 కొట్టేసిన హర్యానా కు చెందిన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను ఈస్ట్ పోలీసులు అరెస్టు చేయడం జరిగిందని వివరించారు. వారి వద్ద నుంచి వివిధ బ్యాంకులకు సంబంధించి 99 ఏటీఎం డెబిట్ కార్డులు, రూ.60వేల నగదు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
నగరంలో గత అక్టోబర్ నుండి ఇప్పటి వరకు బ్యాంక్ ఏటిఎం కు సాంకేతిక లోపం సృష్టించి ట్యాంపరింగ్ మోసాలకు పాల్పడిన హర్యానా రాష్ట్రానికి చెందిన అరీష్ ఖాన్, సలీం ఖాన్ అనే ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను తిరుపతి ఈస్ట్ పోలీసులు అరెస్టు చేశారని వివరించారు. అలాగే వీరి వద్ద నుంచి రెండు తాళంచెవులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలియజేశారు. ఇదే కేసుకు సంబంధించి మరో ముగ్గురు నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని ఎస్పీ వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో ఈస్ట్ డీఎస్పీ మురళి కృష్ణ, ఈస్ట్ సిఐ శివప్రసాద్ రెడ్డి, ఎస్ఐ జయ స్వాములు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital