కడప క్రైమ్, (ప్రభ న్యూస్): కడప జిల్లా ప్రొద్దుటూరు టౌన్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ రాష్ట్ర దొంగలను పోలీసులు పట్టుకున్నారు. వారి నుండి రూ.13.5 లక్షలు విలువ చేసే 270 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. బుధవారం విలేకరులకు ఎస్పీ వివరాలు వెల్లడించారు. ప్రొద్దుటూరు పట్టణం నెహ్రూనగర్ కు చెందిన చంద్ర ఓబుళరెడ్డి అక్టోబర్ 26, 27 తేదీల్లో ఇంట్లో లేని సమయంలో జరిగిన దొంగతనానికి ప్రొద్దుటూరు త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారన్నారు. ప్రొద్దుటూరు ఏ.ఎస్.పి ప్రేర్ణాకుమార్ పర్యవేక్షణలో ప్రొద్దుటూరు త్రీ టౌన్ సి.ఐ టి నారాయణ యాదవ్, ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ యం యుగంధర్ సిబ్బంది కలిసి 2 టీ-ములుగా ఏర్పడి దొంగలను పట్టుకునేందుకు స్పెషల్ టీం ఏర్పాటు చేశారన్నారు.
విచారణలో భాగంగా చుట్టు ప్రక్కల సీసీ కెమెరాలు పరిశీలించి ఇద్దరు వ్యక్తులు పదే పదే చంద్ర ఓబుళరెడ్డి ఇంటి చుట్టూ తిరగడం, వారిలో ఒక వ్యక్తి కుంటుతూ నడవడం గుర్తించారన్నారు. పోలీసులు దర్యాప్తులో భాగంగా కర్నూలు, నంద్యాల, చిత్తూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో నేరాలు చేసి వున్నారని కనిపెట్టి, తద్వారా వారి ఫోటోలు సేకరించారన్నారు. ఈ ఫోటోలలో వున్న వ్యక్తులే ప్రొద్దుటూరులో సీసీ కెమెరాలలో కనపడిన వ్యక్తులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వలపల్లి వెంకటేష్, గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన షేక్ మస్తాన్ వలీ అని నిర్థారించు కున్నామన్నారు.
దర్యాప్తులో భాగంగా ఈ ఇరువురు బుధవారం ఉదయం ప్రొద్దుటూరు బస్టాండు వద్ద వుండగా అరెస్టు చేశామని ఎస్పీ వివరించారు. వలపల్లి వెంకటేష్ చిన్నతనంలోనే ఇల్లు వదిలి హైదాబాద్ చేరి 1996 నుండే దొంగతనాలకు పాల్పడుతూ పలుమార్లు జైలుకు వెళ్లారన్నారు. మస్తాన్ వలీ 2007 లో హవాల డబ్బు విషయమై హైదరాబాద్ లో హత్యకు పాల్పడి చెంచల్ గూడ జైలుకు పోయి వుండగా అప్పటికే ఒక దొంగతనం కేసులో చంచల్ గూడ జైలులో వు వలపల్లి వెంకటేష్, మస్తాన్ వలీలు ఒకరికొకరుపరిచయం అయ్యారన్నారు. ఈ ఇరువురు హైదరాబాద్, తూర్పుగోదావరి, విజయవాడ చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో చోరీలు చేసి జైలుకు వెళ్లారన్నారు.