Monday, November 18, 2024

పాత మల్లాయపాలెం లో పిడుగు పాటు – ఇద్దరు మృతి

.ప్రత్తిపాడు ఏప్రిల్ 23(ప్రభ న్యూస్): నియోజకవర్గ కేంద్రం ప్రత్తిపాడు మండలం లో ఆదివారం మధ్యాహ్నం సుమారు 2:00 గంటల ప్రాంతంలో భారీ ఈదురు గాలులు ఉరుములు,మెరుపులు, వడగళ్లతో కూడిన అకాల వర్షం మిర్చి రైతులను,వ్యాపార అంగళ్లతో పాటు ప్రజాజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది.వివరాల్లోకి వెళితే పాత మల్లాయపాలెం గ్రామంలోని పంట పొలాల్లో రైతులు ఏర్పాటు చేసుకున్న మిర్చి కల్లాల్లో అకాలంగా వచ్చిన వర్షానికి మిరపకాయలు తడవకుండా పట్టలుగప్పే క్రమములో చాట్ల శ్యాంబాబు,కొరివి కృపానందం అనే ఇద్దరు మిర్చి రైతులు పిడుగుపాటుకు గురయ్యారు.

వారి ఇరువును వైద్యం నిమిత్తం ప్రత్తిపాడు లోని సిహెచ్సికి తరలించారు.డాక్టర్లు చూసేటప్పటికి ఒకరు మార్గమధ్యంలోనే చనిపోయాడని,రెండవ వ్యక్తి వైద్యం అందిస్తుండగా చనిపోయాడని తెలిపారు.వీరిద్దరి మృతదేహాలను గుంటూరు జి జి హెచ్ కి తరలించడం జరిగింది.

చాట్ల శ్యాంబాబుకు ఇద్దరు కుమార్తెలు,ఒక కుమారుడు,భార్య ఉన్నారు.కొరివి కృపానందం కు ఒక కుమారుడు,కుమార్తె,భార్య కలరు. అదే సమయంలో తిక్కిరెడ్డిపాలెం రోడ్డుపై భారీ చెట్లు విరిగిపడి వాహనాల రాకపోకులకు అంతరాయం కలిగింది

.ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.వి సుబ్బారావు తమ సిబ్బందితో కలిసి రోడ్లపై విరిగిపడిన చెట్లను, వ్యాపార సముదాయం కూలిపోవటం వలన వచ్చిన రేకులను తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరణ చేశారు. ప్రక్కనే ఉన్న వ్యాపార సముదాయంలో సుమారు 10 లక్షల రూపాయల విలువ చేసే మామిడి కాయలు కావు వేసి ఉన్నాయి.ఒక్కసారిగా వచ్చిన ఈదురు గాలులకు షెడ్డుపై ఉన్న రేకులు విరిగిపడి గాలికి కొట్టుకు పోయి,వడగళ్లతో కూడిన వర్షం పడి మామిడికాయలు పూర్తిగా పాడైపోయినాయి.హఠాత్తు పరిస్థితులను గమనించిన ప్రత్తిపాడు గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ గంగిరెడ్డి పరమారెడ్డి పరామర్శించి పై అధికారులు దృష్టికి తీసుకొని వెళ్లి తగు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement