విశాఖ ఫిషింగ్ హర్బర్ బోట్ల అగ్నిప్రమాదం కేసు మిస్టరీ వీడింది. ఈ కేసులో వాసుపల్లి నాని, అతడి మామ సత్యంలను అరెస్ట్ చేసినట్లు విశాఖ సీపీ రవిశంకర్ అయ్యనార్ తెలిపారు. వాసుపల్లి నానితో పాటూ అతడి మామ సత్యంలు ప్రమాదానికి అసలు కారణమన్నారు. వాసుపల్లి నాని అక్కడ కుక్ కాగా.. సత్యం వాచ్ మెన్ గా పనిచేస్తుంటారన్నారు. ఈ నెల 19న సాయంత్రం 6 గంటలకు వీరిద్దరూ మద్యం తాగడానికి హార్బర్‌కు వచ్చారన్నారు. అల్లిపల్లి వేంకటేష్‌కు చెందిన 887 నంబర్ బోటులో మద్యం తాగి ఫిష్ ఫ్రై చేసుకుని పార్టీ చేసుకున్నారన్నారు. అనంతరం సిగరెట్ తాగి పక్కన ఉన్న 815 నంబర్ బోటుపై పడేసినట్లు సీపీ చెప్పారు. దీంతో మెల్లిగా మంటలు వలకు ఉన్న నైలాన్ తాడుకు అంటుకుని.. ఆ తర్వాతో ఆ బోటు ఇంజన్‌కు విస్తరించాయన్నారు.
అలా మిగిలిన బోట్లకు మంటలు వ్యాపించి కాలిపోయాయన్నారు. బోట్లకు మంటలు వ్యాపించడాన్ని గమనించి మెల్లగా అక్కడి నుండి జారుకున్నారని తెలిపారు. వారిద్దరిపై ఐపీసీ సెక్షన్ 437,438,285, ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. ఈ కేసు దర్యాప్తు లో భాగంగా చాలా మంది అనుమానితుల్ని ప్రశ్నించామన్నారు.తాము పిలిపించి ప్రశ్నించిన వారిలో అనుమానితుల్లో ముగ్గురు నానిలు ఉన్నారని.. అందుకే విచారణలో భాగంగా యూట్యూబర్ నానిని కూడా పిలిచామన్నారు. ప్రాథమిక సమాచారం మేరకు కేవలం విచారణలో భాగంగానే నానిని తీసుకువచ్చామన్నారు. విచారణలో అతడి ప్రమేయం లేదంటే తాము ప్రోసీజర్ ప్రకారం విడిచి పెట్టే వాళ్లమని.. కానీ ఈ లోపే హైకోర్టును ఆశ్రయించారన్నారు.
ఈ కేసుకు సంబంధించి సుమారు 50కు పైగా సీసీ కెమెరాలు పరిశీలించామమన్నారు. ఇన్ని రోజులు ఆధారాలు సేకరించే పనిలో ఉన్నామన్నారు. నిందితులు సిగరేట్ విసిరివేయ్యడంతో వలలకు నిప్పు అంటుకున్న తర్వాత మొదట పోగలు మాత్రమే వచ్చాయన్నారు. ఆ సమయంలో గాలులు బలంగా వీయడంతో మంటలు త్వరగా వ్యాపించాయన్నారు. నిందితులు ఉదయం నుంచి మద్యం తాగుతూనే ఉన్నారని.. విచారణలో వారు నేరం అంగీకరించారన్నారు. ఈ ప్రమాదంలో 30 బోట్లు పూర్తిగా దగ్ధం అవ్వగా.. 18 బోట్లు పాక్షికంగా డామేజ్ అయ్యాయన్నారు. రూ.8 కోట్ల నష్టం వాటిల్లిందని.. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కమాండ్ కంట్రోల్ ద్వారా హార్బర్‌ను మానిటర్ చేస్తామన్నారు.