(ఇబ్రహీంపట్నం, ప్రభ న్యూస్) : ఇటీవల రాష్ట్రంలో సంచలనం కలిగించిన ముంబయి సినీనటి కాదంబరి జత్వాని కేసు కీలక మలుపు తిరిగింది. బాధితురాలు జత్వాని తల్లిదండ్రులు, మరియు న్యాయవాదులతో కలిసి కృష్ణా జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడు విద్యాసాగర్, మరికొంత మందిపై (శుక్రవారం) రాత్రి ఇబ్రహీంపట్నం సీఐ చంద్రశేఖర్ కు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు.
తనను ఇబ్రహీంపట్నంలో కొంతమంది పోలీసు అధికారులు, వ్యక్తులు బంధించి వేధింపులకు గురి చేసినట్లు సుమారు రెండు గంటల పాటు సీఐకి వివరించారు. ఇప్పటికే కాదంబరి కేసు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే! గత ప్రభుత్వ పెద్దల ప్రమేయంతో జత్వానిని వేధించి కేసు నమోదు చేశారు.
ఈ కేసులో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దీనిపై ఇంతకుముందే పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబుకు జత్వాని ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు అధికారిగా ఏసీపీ స్రవంతి రాయ్ ను నియమించారు. ఈ కేసును పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల పాత్ర ఉండటంతో దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులకు సవాల్ గా మారింది. ఈ కేసులో ఇబ్రహీంపట్నం పోలీసుల పాత్రపై కూడా దర్యాప్తు జరగనున్నట్లు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో జత్వానిని వేధింపులకు గురిచేసిన ఐపీఎస్ అధికారులపై వేటు వేసి అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది.