అమరావతి, ఆంధ్రప్రభ: పూడిక పేరుతో తుంగభద్ర జలాలను నిబంధన లకు విరుద్ధంగా తరలించేందుకు కర్ణాటక చేస్తున్న ప్రయత్నాలను ఏపీ తీవ్ర స్థాయిలో అడ్డుకుంటోంది. తుంగభద్ర బోర్డు గతంలో చేసిన సర్వేల సాంకేతిక నివేదికలను బయటపెట్టటం ద్వారా కర్ణాటక చెప్పే పూడిక మాటలన్నీ సాకులు మాత్రమేనని స్పష్టం చేస్తోంది. ఈ మేరకు తుంగభద్ర బోర్డు ఆధ్వర్యంలో ఆర్.వి అసోసియేట్ చేసిన సర్వే నివేదిక ప్రామాణికంగా చేసుకుని కర్ణాటక చెప్పే వన్నీ కుంటిసాకులేనని చెబుతోంది. ఇదే విషయాన్ని తాజాగా ఏపీ అధికారులు తుంగభద్ర బోర్డు ముందుంచి తమ వాదనలు వినిపించారు. తుంగ భద్రలో పూడిక వల్ల తమకు కేటాయించిన 151.49 టీ-ఎంసీలను వినియోగించుకోలేకపోతున్నామని చెబుతున్న కర్ణాటక వాటా జలాలను సద్వినియోగం చేసుకునేందుకు నవలి రిజర్వాయర్ నిర్మాణానికి అనుమతులివ్వాలని బోర్డు ముందు ప్రతిపాదించింది.
1951లో 133 టీ-ఎంసీల సామర్దంతో నిర్మించిన తుంగ భద్ర డ్యాంలో ఏటా వరద ప్రవాహాన్ని కూడా కలుపుకుంటే 230 టీ-ఎంసీల లభ్యత ఉంటు-ందని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అంచనా. దాని ఆధారంగానే కర్ణాటకకు 151.49 టీ-ఎంసీలు, ఏపీకి 72, తెలంగాణకు 6.51 టీ-ఎంసీలను బోర్డు కేటాయించింది. ఏపీ కేటాయించిన తుంగభద్ర జలాల్లో హెచ్ ఎల్సీ కి 32.50 టీ-ఎంసీలనూ, ఎల్లెల్సీకి 29.50 టీ-ఎంసీలు, కేసీ కెనాల్ కు 10 టీ-ఎంసీలను కేటాయించారు. 2008లో బోర్డు చేసిన సర్వేలో పూడిక పోను తుంగభద్రలో 100.85 టీ-ఎంసీల నిల్వ ఉంటు-ందని అంచనాలు రూపొందించారు. ఆ తరువాత 2016లో తుంగభద్ర బోర్డు ఆర్ వి అసోసియేట్ అనే సంస్దతో టోపోగ్రాఫికల్ సర్వే చేయించింది. ఆ సంస్థ సర్వే ఆధారంగా పూడిక పోను నిల్వ సామర్ద్యాన్ని 105.78 టీ-ఎంసీలుగా నిర్ణయించింది.
ఈ విషయాన్ని బోర్డు సమావేశాల్లో మూడు రాష్ట్రాల్ర ముందుంచగా కర్ణాటక కూడా ఏకీభావం తెలిపి ఆ తరువాత మాట మార్చింది. నవలి రిజర్వాయర్ నిర్మాణం కోసం కొత్త రాగం అందుకుంది. తుంగభద్ర నిల్వ సామర్దం 100 టీ-ఎంసీలకు మించి లేదనీ, పూడిక పోను మూడు రాష్ట్రాల్రకు చేసిన పున:పంపిణీ వల్ల ఎగువ రాష్ట్రమైన తమకు ఎక్కువ నష్టం వాటిల్లుతుందని కర్ణాటక చెబుతోంది. కేటాయింపుల మేర తాము పూర్తిస్థాయిలో నీటిని వినియోగించుకునేందుకు నవలి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్టు- బోర్డుకు తెలియచేసింది. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉండగా నవలి రిజర్వాయర్ నిర్మాణానికి కేంద్ర జలశక్తి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. దీనిపై తెలంగాణ, ఏపీ నుంచి పూర్తిస్థాయి వ్యతిరేకత వచ్చినా పట్టించుకోలేదు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం, ఏపీ, తెలంగాణ నుంచి నవలి ప్రాజెక్టుకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర జలశక్తి తీసుకోనున్న నిర్ణయం ఆసక్తిగా మారింది.