- 31న టీటీడీ సమీక్ష సమావేశం
- ఫిబ్రవరి 4న ఆర్జిత సేవలు రద్దు
తిరుమలలో సూర్య జయంతి సందర్భంగా రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగనున్నాయి. ఒకే రోజు ఏడు వాహనాలపై మలయప్ప స్వామి తిరుమల మాడవీధుల్లో విహరించి భక్తులకు అభయ ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా తిరుమలకు అధిక సంఖ్యలో భక్తుల తరలివచ్చే అవకాశం ఉన్నందున.. ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని రద్దు చేశారు.
ఇక ఫిబ్రవరి 4న, ఆర్జిత సేవలతో పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. ఆ రోజు నేరుగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే దర్శనం కల్పించనున్నారు. అలాగే ఎన్‌ఆర్‌ఐలు, చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, వికలాంగులకు ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేశారు.
కాగా, ఇటీవల తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకుని.. ఫిబ్రవరి 4న నిర్వహించనున్న రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు జనవరి 31న టీటీడీ బోర్డు అత్యవసరంగా సమావేశం అయ్యి.. అధికారులకు కీలక సూచనలు చేయనుంది.
రథ సప్తమి వాహన సేవల షెడ్యూల్..
- 5:30 AM – 8:00 AM: సూర్య ప్రభ వాహనం
- 9:00 AM – 10:00 AM: చినశేష వాహనం
- 11:00 AM – 12:00 PM: గరుడ వాహనం
- 1:00 PM – 2:00 PM: హనుమంత వాహనం
- 2:00 PM – 3:00 PM: చక్ర స్నానం
- 4:00 PM – 5:00 PM: కల్ప వృక్ష వాహనం
- 6:00 PM – 7:00 PM: సర్వభూపాల వాహనం
- 8:00 PM – 9:00 PM: చంద్రప్రభ వాహనం