Thursday, November 21, 2024

ఆలయ నిర్వహణలో టీటీడీ ప్రపంచానికే దిక్సూచి: వార‌ణాసిలో ఈవో ధ‌ర్మారెడ్డి

తిరుమల, ప్రభన్యూస్ ప్రతినిధి) : ఆలయ నిర్వహణకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడీ) ప్రపంచానికే దిక్సూచిగా నిలుస్తోందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఆలయ నిర్వాహకుల దృఢ నిశ్చయం, లక్ష్యం, చిత్తశుద్ధి, భక్తి దేవాలయాల పరిపాలన, అభివృద్ధికి క‌చ్చితంగా ఉపయోగపడతాయని అన్నారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని వారణాసిలోని రుద్రాక్ష్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో మూడు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ దేవాలయాల సమ్మేళనంలో ఈవో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

30 దేశాలకు చెందిన వివిధ హిందూ దేవాలయాల నిర్వాహకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రపంచ ప్రఖ్యాతిచెందిన పుణ్యక్షేత్రమైన తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు టీటీడీ కల్పిస్తున్న వసతులు, ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలు, ఆలయ నిర్వహణకు సంబంధించిన పాలనా వ్యవస్థపై ఈవో అరగంటపాటు అందించిన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ నిర్వాహకుల దృష్టిని ఆకర్షించింది.

ఈ సందర్భంగా ఈవో ధ‌ర్మారెడ్డి ప్రసంగిస్తూ యాత్రికులకు శ్రీవారి దర్శనం, వసతి, తలనీలాలు, లడ్డూల తయారీ తదితర అంశాల్లో టీటీడీ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలుస్తోందన్నారు. సమర్థ నిర్వహణ వల్లనే ఇది సాధ్యమైందని తెలిపారు. ఆలయం పవిత్రంగా ఉండాలని, చక్కటి పరిశుభ్రత పాటించాలని, భక్తులకు మంచి దర్శనం, వసతులు కల్పించాలన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్య, వైద్యం, అన్నదానం, వేద సంస్కృతి పరిరక్షణ చేపట్టాలన్నారు. టీటీడీ ఇలాంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తోందని వివరించారు. స్విట్జర్లాండ్‌, సింగపూర్‌ లాంటి దేశాల తరహాలో తిరుమలలో పారిశుద్ధ్యం ఉందన్నారు.


పురాతన ఆలయాల పునరుద్ధరణకు, మతమార్పిడులను అరికట్టేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రాంతాల్లో నూతన ఆలయాల నిర్మాణం కోసం శ్రీవాణి ట్రస్టును ప్రారంభించామని తెలిపారు. ఇప్పటివరకు 170 పురాతన ఆలయాల పునరుద్ధరణకు ఆర్థిక సాయం అందించామని, 300 ఆలయాల నిర్మాణం పూర్తయిందని, దాదాపు రెండు వేల ఆలయాలు వివిధ దశలో ఉన్నాయని చెప్పారు. భక్తులు దాదాపు 900 కోట్ల రూపాయలు శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు అందజేశారని, ఇప్పటివరకు 330 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని వివరించారు. ఈ ట్రస్టుకు రూ.10 వేలు విరాళం అందించిన దాతలకు ఒక బ్రేక్‌ దర్శనం టికెట్‌ అందజేస్తున్నామన్నారు.

- Advertisement -

చిన్నపిల్లలకు కార్డియాలజీతోపాటు ఇతర విభాగాలతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం జరుగుతోందని, డిసెంబర్‌ నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో 71 ఆలయాలు, 11 ట్రస్టులు, 14 ఆసుపత్రులు, 35 విద్యాసంస్థలు, 9 వేద పాఠశాలలు, నాలుగు గోశాలలు, 300 కళ్యాణ మండపాలు, 10 ధార్మిక సంస్థలు, నాలుగు భాషల్లో శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌, అనాధ పిల్లల కోసం బాలమందిరం, రెండు మ్యూజియంలు ఉన్నాయన్నారు.

శ్రీవారికి నైవేద్యం కోసం రసాయనాలు, పురుగుమందులు లేని గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వినియోస్తున్నామని తెలిపారు. ఇతర ఆలయాల్లో కూడా ఈ ఉత్పత్తులను వినిగించాలని . అంతకుముందు, రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌) చీఫ్‌ మోహన్‌ భగత్‌ తన ప్రసంగంలో శ్రీవాణి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వెనుకబడిన ప్రాంతాల్లో నూతన ఆలయాల నిర్మాణం, శిథిలావస్థలో ఉన్న ఆలయాల పునరుద్ధరణను పెద్దఎత్తున చేపట్టినందుకు టీటీడీని ప్రశంసించారు. టీటీడీ ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలపై ప్రశంసలు కురిపించారు. అనంతరం ఈవో ఎవి ధర్మారెడ్డిని సమ్మేళనం చైర్మన్‌ ప్రసాద్‌ మినేష్‌ లాడ్‌, టెంపుల్స్‌ కనెక్ట్‌ వ్యవస్థాపకులు గిరీష్‌ కులకర్ణి శాలువా, మెమెంటోతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షులు శేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement